అజరామరం!
అభీష్టం..
అభ్యుదయం..
● వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తిలో ప్రతిభ చాటుతూ..
● కుటుంబ బాధ్యతలు మోస్తూ.. సమాజసేవలో తరిస్తూ..
● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు
ఇష్టమైన పనిచేయడం సాధారణం.. ఆ పనినే విభిన్నంగా చేయడం అభీష్టం. అభీష్టాలను సమాజానికి ఉపయోగపడేలా చేయడం అభ్యుద యం. అంతటి అభ్యుదయ భావాలతో సమాజంలోని అవసరార్ధులు.. అన్నార్థులు.. అనాథలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిని కొనసాగిస్తూనే ప్రవృత్తిగా సేవ చేస్తున్నారు. బతుకుదెరువు వెతుకుతూనే.. గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. కొందరు అన్నార్థుల ఆకలి తీరుస్తుండగా.. మరికొందరు అనాథశవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఇలాంటి వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్.
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 20 ఏళ్లుగా అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వహిస్తున్న మల్లుగారి నర్సాగౌడ్ దాదాపు 30 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. 20 ఏళ్లుగా వృద్ధులు, అనాథల ఆలనాపాలన చూస్తున్నారు. ఆశ్రమంలో ఎవరైనా వృద్ధులు చనిపోతే.. మతాచారాలు, సంప్రదాయాలు అన్నీ పాటిస్తూ పూర్తి గౌరవంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఎవరూ లేని వాళ్లు కూడా చివరి ప్రయాణంలో ఒంటరిగా ఉండకూడదు అన్నది నర్సాగౌడ్ నమ్మకం.
రామగుండం: జీవనశైలిలో మార్పు చేసుకుంటేనే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటుందని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అంటున్నారు. పదిహేనేళ్లుగా పూర్తిగా భోజనం మానేసి ఉదయం వ్యాయామంతో జీవన విధానాన్ని ఆరంభించడం అలవాటుగా మారిందని తెలిపారు. రోజూ ఆహారంగా అంబలి, రాగిజావ, మొక్కజొన్న గటుక, మొలకెత్తిన పెసర్లు, చిరుధాన్యాలు తీసుకుంటానని, తద్వారా చురుగ్గా ఉండి మానసిక ప్రశాంతత పొందగలుగుతాం అని వివరించారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగే క్రమంలో వాహనంలో క్యారెట్, కీరదోస తదితరాలను తీసుకుంటానని, దీంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ నిత్య యవ్వనంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అదే తన ఆరోగ్య రహస్యమని వివరించారు.
అజరామరం!


