తగ్గేదెలే..తవ్వుడే !
కఠినంగా వ్యవహరిస్తున్నాం
చందుర్తి(వేములవాడ): చీకటి పడితే చాలు మట్టి, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తమ పంట పొలాలకు నష్టం జరుగుతుందని అడ్డుకోబోతే అంతుచూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక రైతులు కుమిలిపోతున్నారు. మార్కెట్‌లో మట్టి, ఇసుకకు డిమాండ్ ఉండడంతో చందుర్తి సర్కిల్ పరిధిలోని ఒర్రెలు, కుంటల్లోని నుంచి ఇసుకను, ప్రభుత్వ భూముల్లో నుంచి, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ మట్టిని తరలించుకుపోతున్నారు.
జోరుగా దందా
చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో రాత్రింబవళ్లు మట్టి, ఇసుక తరలిపోతుంది. గతంలో చందుర్తి సర్కిల్ పరిధిలో మట్టి అక్రమ రవా ణాను కలెక్టర్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేయించిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది.
కొరత సృష్టించి.. ధర పెంచి !
ఇళ్ల నిర్మాణాదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇసుక కొరత సృష్టిస్తున్నారు. అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, ఇసుక దొరకడం లేదంటూ ధరలు పెంచేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.4,500 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మట్టి అవసరం ఉన్న వారికి బాధలు మాత్రం వర్ణనాతీతం. గతంలో రూ.500 నుంచి రూ.700 లభించే మట్టికి ప్రస్తుతం ట్రాక్టర్‌కు రూ.1800 నుంచి రూ.2200 వరకు వసూలు చేస్తున్నారు.
పోలీసుల కదలికలు తెలుసుకొని..
అక్రమ రవాణాలో ఆరితేరిన మాఫియాలోని కొందరు స్థానిక కానిస్టేబుళ్లతో సన్నిహితంగా ఉంటూ రాత్రి వేళ పెట్రోలింగ్ పార్టీల కదలికలు తెలుసుకుంటూ దందా చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు మూమూళ్లు ఇస్తున్నామంటూ చెప్పుకుంటేనే అక్రమ రవాణాకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చందుర్తి మండలంలో ఆశిరెడ్డిపల్లెలో గత 20 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ మట్టిని జేసీబీ, టిప్పర్ల సహాయంతో తోడేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వాహనాలు పట్టుబడినా ఇందిరమ్మ ఇళ్ల పేరిట వదిలేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉన్నతాఽధికారులకు అనుమానం రాకుండా అప్పడప్పుడు ఒకటి, రెండు ఇసుక, మట్టి వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చందుర్తిలో తెల్లవారుజామున ఇసుక తరలింపు
‘ఆరు రోజుల క్రితం కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో రుద్రంగి మండలం చింతామణితండాకు చెందిన గుగులోతు గంగాధర్ ఇసుక ట్రాక్టర్‌పై నుంచి పడి చనిపోయాడు. అక్రమంగా ఇసుక తరలిస్తూ వేగంగా పోవడంతోనే యువకుడు మరణించినట్లు తెలుస్తోంది. ’
‘రుద్రంగి మండల కేంద్రానికి కథలాపూర్ మండలంలోని ఒర్రెలు, వాగుల్లో నుంచి ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. ఇదంతా రాత్రి వేళల్లోనే తరలిపోతుంది. ఇందుకు ఇటీవల పోలీసులకు చిక్కిన టిప్పర్లే నిదర్శనం.’
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తప్పవు. ఎక్కడైనా మట్టి , ఇసుక రవాణా జరిగితే మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. రుద్రంగిలో ఇప్పటికే రెండు ఇసుక టిప్పర్లను సీజ్ చేశాం. ఇసుక అక్రమ డంప్‌లను రెవెన్యూ అధికారులకు అప్పగించాం. అక్రమ రవాణాదారులపై కఠినంగా వ్యవహరిస్తాం.
– గాండ్ల వెంకటేశ్వర్లు, సీఐ, చందుర్తి
తగ్గేదెలే..తవ్వుడే !


