అన్నింటికీ భీమేశ్వర సదన్
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమేశ్వర సదన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనుల కారణంగా ఇటు ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్ విభాగం, అకౌంట్స్ విభాగాలను భీమేశ్వరసదన్‌లోకి మార్చారు. దీంతో ఆలయ పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు, రోజువారీ కార్యకలాపాలు అన్నీ ఒకే చోట నుంచి సాగుతున్నాయి.
ఉత్సవాలకు వేదిక
కార్తీక దీపోత్సవం, హుండీ లెక్కింపులతోపాటు ఈనెల 7న నిర్వహించే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కూడా భీమేశ్వర సదన్ వేదికగానే సాగుతున్నాయి. మహాజాతర ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు, రాజన్న ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశాలు భీమన్న సదన్‌లోనే నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు భక్తులకు విడిదిగా ఉన్న భీమేశ్వర సదన్ ఇప్పుడు రాజన్న ఆలయ పరిపాలన విభాగాలకు కేంద్రంగా మారింది. గతనెల 30న మహాశివరాత్రి జాతర మహోత్సవాల సమన్వయ కమిటీ సమావేశం సైతం భీమేశ్వర సదన్ పోర్టికోలోనే నిర్వహించారు. రూ.11కోట్లతో మూడంతస్తులు.. 80 ఏసీ గదులు నిర్మించిన భీమేశ్వర సదన్ ఇప్పుడు రాజన్న ఆలయ పరిపాలన కేంద్రంగా మారింది.
అన్నింటికీ భీమేశ్వర సదన్


