నిఘా నిద్రపోతోంది !
అందుబాటులోకి తీసుకొస్తాం
● పల్లెల్లో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని అధికారులు ● దొరకని దొంగలు
వేములవాడరూరల్: పల్లెల్లో నిఘా కరువైంది. గతంలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలలో సగానికి పైగా పనిచేయడం లేదు. రెండేళ్లుగా పల్లెల్లో పాలకవర్గాలు లేకపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. దొంగతనాలు, ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు.. ఎవరు నిందితులో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో జిల్లాలో చాలా కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
13 మండలాలు.. 3,200 సీసీ కెమెరాలు
జిల్లాలోని 13 మండలాల్లో దాదాపు 3,200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో జిల్లా పోలీస్ శాఖ ఆదేశాలతో చాలా గ్రామాల్లో అప్పటి ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, దాతలు ముందుకొచ్చారు. కొన్ని రోజులు బాగానే పర్యవేక్షించిన గ్రామపంచాయతీ సిబ్బంది తర్వాత పట్టించుకోలేదు. దీంతో చాలా గ్రామాల్లో సగానికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు జరిగిన సమయంలో దొంగలను గుర్తించడం కష్టంగా మారింది.
నిఘా నేత్రంతో 32 కేసులు ఛేదన
జిల్లాలో గతేడాది సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో 32 కేసులను పోలీసులు ఛేదించారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోయారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఉండడంతో క్షణాల్లో నిందితులను పట్టుకునే అవకాశాలు ఉంటాయని పోలీస్‌లు చెబుతున్నారు.
గ్రామాల్లోని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తాం. చాలా గ్రామాల్లో కోతులు, వర్షాలతో సాకెట్‌లు, ప్లగ్‌లు పోతున్నాయి. దీంతో పనిచేయడం లేదు. వెంటనే ప్రజాప్రతినిధులతో మాట్లాడి పనిచేసేలా విధంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, వేములవాడరూరల్
నిఘా నిద్రపోతోంది !
నిఘా నిద్రపోతోంది !


