ఆరోగ్య అవగాహన కల్పించాలి
● వైద్యపరీక్షలు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఎస్‌ఐఆర్–2022పై వీడియో కాన్ఫరెన్స్
సిరిసిల్ల: జిల్లాలోని ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని, వైద్యపరీక్షలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో శనివారం వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు, టీబీ, కుష్టు తదితర కేసులపై చర్చించారు. టీబీ, కుష్టు వ్యాప్తితో కలిగే ఇబ్బందులు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్సీడీ స్క్రీనింగ్ సకాలంలో పూర్తి చేసి అవసరమైన వారికి చికిత్స అందించాలని సూచించారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ రవీందర్ పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పూర్తి చేయాలి
ఎస్‌ఐఆర్–2022 జాబితాతో 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయి అధికారి రోజూ 30 ఎంట్రీలు టార్గట్‌గా పని చేయాలన్నారు. అంతకుముందు ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో సుదర్శన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌ఐఆర్‌పై సమీక్షించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఆఫీస్‌ల్లో హెల్ప్‌డెస్క్‌లు
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఓటర్ జాబితాలో అవసరమైన సహాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తాయన్నారు. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 9లోగా ఆయా మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు.


