రోడ్డు ప్రమాదాలే అధికం
డిసెంబరు 31న ఉమ్మడి జిల్లాలో.. 107 అత్యవసర కేసులు, 109 రోడ్డు ప్రమాదాలు మొత్తం 216 మంది ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది మద్యం మత్తులో జరిగినవే అధికం: ఈఎంటీ సిబ్బంది
ఉమ్మడి జిల్లాలో 31వ తేదీన 108 సేవలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
డిసెంబరు 31.. అంటేనే సంబరాల రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే దినోత్సవం వేళ.. మద్యం ఏరులై పారింది. అదేస్థాయిలో ప్రమాదాలకు కూడా కారణమైంది. డిసెంబరు 31న రాత్రి పూట 108 సిబ్బంది దాదాపు 216 మంది ప్రాణాలు కాపాడగా.. అందులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి. అందులోనూ మద్యంమత్తులో జరిగినవే అధికంగా ఉన్నాయని ఈఎంటీ సిబ్బంది వెల్లడించారు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పలు ఎమర్జెన్సీ కేసుల విషయంలో స్పందించిన సిబ్బంది పలువురి ప్రాణాలు కాపాడారు.
54 వాహనాలు, 108 మంది సిబ్బంది
డిసెంబరు 31న రాత్రి మొత్తం 54 వరకు 108 అంబులెన్సుల్లో 108 మంది విధుల్లో ఉన్నారు. వీరిలో 54 మంది పైలెట్లు, 54 మంది ఈఎంటీలు ఉన్నారు. వాస్తవానికి పండగ రోజు, లోకమంతా సెలబ్రేషన్లలో మునిగి తేలుతున్నా.. అత్యవసర సేవలు కావడంతో వీరంతా విధినిర్వహణలోనే మునిగిపోయారు. ఈక్రమంలోనే 107 అత్యవసర కేసులు కాగా, 109 వరకు చిన్నా చితకా రోడ్డు ప్రమాదాల కేసులే అధికంగా నమోదవడం గమనార్హం. చిన్న రోడ్డు ప్రమాదాల్లోనూ 109 కేసుల్లో 90శాతం మద్యం వల్ల జరిగిన ప్రమాదాలే కావడం గమనార్హం. అదే రోజు రాత్రి ఉమ్మడిజిల్లాలో ప్రతీ చోటా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు జరిపినా.. తాగి వాహనాలు నడపవద్దని కోరినా.. మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
గర్భిణుల తరలింపు 36
తీవ్ర రోడ్డు ప్రమాదాలు 16
గుండెపోట్లు 32
శ్వాస సంబంధ వ్యాధులు 23
మైనర్ రోడ్డు ప్రమాదాలు 109
మొత్తం కేసులు 216


