సేవలకు గుర్తింపు
● ఉత్తమ సహకార సంఘంగా ఇల్లంతకుంట పీఏసీఎస్
ఇల్లంతకుంట(మానకొండూర్): రైతులకు రుణాలు మంజూరు చేయడంతోపాటు రికవరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుండడం.. బ్యాంకుకు సంబంధించిన నిధులు నిల్వ ఉండడం.. గోదాముల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఇల్లంతకుంట ప్రాథమిక సహకార సంఘానికి 2025వ సంవత్సరానికి సంబంధించిన అత్యుత్తమ పురస్కారం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.
1983 నుంచి రైతుల సేవలో..
ఇల్లంతకుంట సహకార సంఘం 1983లో ఏర్పడింది. అంతకుముందు 1958లో గ్రామస్థాయిలో సంఘంగా ఉండేది. సింగిల్‌విండోగా ఏర్పడినప్పటి నుండి సొసైటీ అభివృద్ధి బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఇల్లంతకుంట ప్యాక్స్ 28 గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఇల్లంతకుంట సహకార సంఘంలో 4,478 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సంఘం పరిధిలోని 371 మంది రైతులకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.20.29కోట్ల రుణాలు అందజేశారు. స్వల్పకాలికంగా పంట రుణాల కింద 1683 మందికి రూ.17.40 కోట్లు అందజేశారు. సొసైటీ పరిధిలో కందికట్కూర్, రేపాక, పెద్దలింగాపురం, ఇల్లంతకుంటల్లో ఎరువుల గోదాములు ఉన్నాయి. సొసైటీ ఆవరణలో పెట్రోల్, డీజిల్ బంక్ ఏర్పాటు చేశారు. దీని కోసం ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకోలేదు. సొంత నిధులతోనే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. అదేవిధంగా సొసైటీకి సంబంధించిన ఐదు ఎకరాల కమర్షియల్ భూమి కూడా ఉంది. సొసైటీ ద్వారా ఇచ్చిన వివిధ రకాలైన రుణాల రికవరీ 95 శాతం వరకు ఉందని సొసైటీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇల్లంతకుంట ప్యాక్స్‌కు ఎఫ్‌పీవో(రైతు ఉత్పత్తిదారుల సంస్థ)గా గుర్తింపు దక్కింది. దీని కింద రూ.3.50లక్షలు సమకూరినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.


