బిల్లుల పంచాయితీ
ఏళ్లుగా పెండింగ్‌లోనే కరెంట్ బిల్లులు నూతన పాలకవర్గాలకు పెనుభారం జీపీల విద్యుత్ బిల్లులు రూ.386 కోట్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం బకాయిలు రూ.700 కోట్లు సెస్‌కు గుదిబండగా బకాయిలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇటీవల కొలువుదీరిన గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలకు విద్యుత్ బిల్లుల బకాయిలు కలవరపెడుతున్నాయి. కొన్నేళ్లుగా విద్యుత్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా శ్రీసెస్‌శ్రీ సంస్థకు గ్రామపంచాయతీలు విద్యుత్ బిల్లుల రూపంలో రూ.386 కోట్లు బకాయిలు పడ్డాయి. ఈ బిల్లులు చెల్లించడం నూతన పాలకవర్గాలకు తలకుమించిన భారంగా మారింది. అదే విధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలుపుకొని రూ.700 కోట్లకు పైగా బకాయిలు పడ్డట్లు సెస్ అధికారులు చెబుతున్నారు. ఈ బకాయిలతో సెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
నిధులు లేక నీరసం
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా.. రూ.386కోట్లు విద్యుత్ బకాయిలు పడ్డాయి. ఏళ్లుగా పంచాయతీలలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించడం ఇబ్బందిగా మారింది. జీపీలలో నిధులు లేకపోవడం, వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్లకు, చెత్తసేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ నిర్వహణకే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెస్ విద్యుత్ సంస్థ అధికారులు కరెంట్ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడం కొత్త పాలకవర్గాలకు తలనొప్పిగా మారింది.
సెస్‌పై భారం
జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు సెస్ సంస్థ విద్యుత్ సేవలు అందిస్తుంది. సెస్ సంస్థ ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తుంది. ఇలా సేవలు అందించినందు కు కొంత మొత్తంలో లాభాలు సైతం తీసుకుంటుంది. అయితే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. గ్రామాల్లోని వీధిదీపాలు, నీటి సరఫరా మోటార్ల బిల్లులు ప్రతీ నెల లక్షల్లోనే వస్తున్నాయి. ఈ బిల్లులు పంచాయతీలు చెల్లించకపోవడంతో సెస్ సంస్థపై భారంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.700 కోట్లకు పైగానే బకాయిలు సెస్ సంస్థకు రావాల్సి ఉంది. ఈ బిల్లులు వసూలు అయితే సెస్ సంస్థ అభివృద్ధి దిశలో దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు ఇలా..
గ్రామపంచాయతీలు : 260
బకాయి బిల్లులు : రూ.386 కోట్లు
మున్సిపాలిటీలు : 02
విద్యుత్ బకాయిలు : రూ.114 కోట్లు
జిల్లా వ్యాప్తంగా సెస్‌కు బకాయిలు : రూ.700 కోట్లు


