జర్నలిస్టులకు నష్టం చేసే జీవో 252 సవరించాలి
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు అందించాలి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా
సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 252 జర్నలిస్టుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని వెంటనే ఉపసంహరించుకోవాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లాయక్‌పాషా కోరారు. కలెక్టరేట్ ఎదుట శనివారం నిర్వహించిన నిరసనలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మెజారిటీ జర్నలిస్టులు అక్రిడిటేషన్‌కార్డులు పొందే అవకాశాన్ని కోల్పోతారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను, ఉద్యోగాలను ఫణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి జీవోను సవరించాలని కోరారు. జిల్లా జర్నలిస్టు నాయకులు సామాల గట్టు, ఇరుకుల ప్రవీణ్, మహమ్మద్ అజీమ్, గౌరవ సలహాదారులు రాపెల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


