డీపీఆర్వో ఎక్కడ ?
● మూడు నెలలుగా పోస్టు ఖాళీ ● ఇన్‌చార్జి రారు.. ఫుల్‌చార్జి అధికారిని చేర్చుకోరు
సిరిసిల్ల: జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి(డీపీఆర్వో) పోస్టు మూడు నెలలుగా ఖాళీగానే ఉంది. కరీంనగర్ డీపీఆర్వో లక్ష్మణ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినా ఆయన జిల్లాకు చుట్టపు చూపుగానే వస్తున్నారు. గతంలో డీపీఆర్వోగా ఉన్న శ్రీధర్‌ను సెప్టెంబరులో అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సస్పెన్షన్ చేశారు. ఈ సస్పెన్షన్‌ను తొలగిస్తూ.. మళ్లీ జిల్లాలోనే నియమిస్తూ డిసెంబరు 4న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ విధుల్లోకి తీసుకోకుండా కలెక్టర్ నిలువరించినట్లు సమాచారం. దీంతో డీపీఆర్వో శ్రీధర్ మరో జిల్లాకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఏపీఆర్వోతోనే వెల్లదీస్తున్నారు. జిల్లాలో అనేక పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులు కొనసాగుతున్నారు. గతంలో ఓ వెలుగు వెలిగిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇప్పుడు ఇన్‌చార్జి అధికారులు, ఖాళీ పోస్టులతో వెలవెలబోతుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవచూపి ఇప్పటికై నా జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా స్థాయి అధికారుల పోస్టులను భర్తీ చేయిస్తే.. ప్రభుత్వ పాలన సమర్థంగా సాగే అవకాశం ఉంది.


