రైతులకు న్యూ టెక్నాలజీ అందించాలన్నదే లక్ష్యం
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేసేందుకు వ్యవసాయ వర్సిటీలో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్, సెంటర్ ఫర్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మానవ రహిత వ్యవసాయం చేసేలా రోబోటిక్స్, డ్రోన్స్, సెన్సార్ వంటి టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయి.
వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఓ వైపు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు రైతులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం ఖరీఫ్ సీజన్‌కు ముందు 1200 గ్రామాల్లో శ్రీరైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించాం. పరిశోధన స్థానాల్లో రూపొందించిన విత్తనాలను అభ్యుదయ రైతులకు ఉచితంగా ఇచ్చేలా విత్తన మేళాలు ఏర్పాటు చేశాం. వారు పండించిన విత్తనాలను గ్రామంలోని రైతులందరికీ అందేలా చూస్తున్నాం.
గతంలో రైతు పిల్లలకు మాత్రమే వ్యవసాయ విద్యలో రిజర్వేషన్‌పరంగా సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు కూడా 180 సీట్లు ఇచ్చాం. గతంలో అగ్రికల్చర్ స్పెషల్ కోటా సీట్ల ఫీజు రూ.10 లక్షలు ఉంటే.. సామాన్యుడికి భారం కాకుడదని రూ.5లక్షలకు తగ్గించాం. ఈ మొత్తం కూడా ఒకేసారి కాకుండా సెమిస్టర్‌కు రూ.62,500 చొప్పున 8 విడతలుగా చెల్లించేలా నిబంధనలు తెచ్చాం.
తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వివిధ దేశాలతో పలు ఒప్పందాలు చేసుకుంది. అమెరికాలోని కాన్సాప్ స్టేట్ యూనివర్సిటీ, ఫ్లోరిడా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకున్నాం. దేశీయ సంస్థలైన బిట్స్‌పిలాని, ఐసీఎఆర్, ఐఐఆర్‌ఆర్, స్విట్జర్లాండ్‌కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.
వ్యవసాయ యూనివర్సిటిలో 2013 నుంచి వైస్ చాన్స్‌లర్ పోస్టు మినహా మిగతా ఖాళీగా ఉండేవి. నేను బాధ్యతలు తీసుకున్న 100 రోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారులు పోస్టులు భర్తీ చేసి పాలన సజావుగా జరిగేలా చూశాను. రిజిస్ట్రార్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డీన్ ఆఫ్ రిసెర్చ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్..ఇలా అన్ని పోస్టులను భర్తీ చేశాం.
రసాయనాలు తగ్గించేలా సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్నాం. పురుగుల మందులతో రక రకాల సమస్యలు వస్తున్నాయి. యూరియాపై సబ్సిడీ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. రాష్ట్రంలో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేని చోట రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
రాష్ట్రంలో కొత్తగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఏడు వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటికి తోడు అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల, రెండు ఫుడ్ సైన్స్ కళాశాలలు, ఒక హోం సైన్స్ కళాశాల ఉంది. ఒక వ్యవసాయ కళాశాల స్థాపించేందుకు ఐసీఎఆర్ నిబంధనల ప్రకారం 100 ఎకరాలతోపాటు రూ.150 కోట్లు నిధులు అవసరం. ప్రతి కళాశాలకు 180 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో 40 మంది టీచింగ్ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ జానయ్య
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లోకి తీసుకెళ్లేందుకు న్యూ టెక్నాలజీ రూపంలో ముందుకెళ్తున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య


