ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యక్తి హఠాన్మరణం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓదెల రాజేందర్ ఉరఫ్ రాజు(40) బుధవారం హఠాన్మరణం చెందారు. భూసంబంధమైన సమస్య పరిష్కరించాలంటూ గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆరా తీసేందుకు ఆయన ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి రాజేందర్.. కార్యాలయం ఎదుట గుండెపోటుకుగురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు సుల్తానాబాద్‌లోని ఓప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
ధర్మపురి: తల్లిదండ్రులు మందలించారని క్షణికావేశంలో గడ్డిమందు తాగిన విద్యార్థిని చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్సై మహేష్ కథనం ప్రకారం.. మండలంలోని ఆరెపెల్లికి చెందిన నూతికట్ల రాజన్న దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు నీరజ (20) సంతానం. ధర్మపురిలో డిగ్రీ చదువుతోంది. చిన్నప్పటి నుంచే ఏ పని చేయకుండా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోంది. ఈనెల 17న తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. రాజన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
రాయికల్: పట్టణంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు. నాలుగు రోజుల క్రితం 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు శవాన్ని బయటకు తీసి చూడగా.. తల వెనుక గాయం కనిపించింది. ఎవరైనా దాడిచేశారా..? లేకుంటే చెరువులో నాలుగురోజులుగా ఉండటంతో క్రిమికీటకాలు తిన్నాయా..? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని చాతిపై అమ్మ, నాన్న, కుడిచేతిపై మౌనిక, మల్లేశం అనే టాటూలు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు.
అదుపు తప్పిన కారు
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని స్తంభంపల్లి గంజివాగు కల్వర్టు వద్ద కారు అదుపు తప్పింది. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు. గంగాధర మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కొందరు కొమురవెల్లి, వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తుండగా స్తంభంపల్లి గంజివాగు కల్వర్టు వద్ద కారు అదపు తప్పింది. చివరిలో నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు కారుకు తాళ్లు కట్టి ట్రాక్టర్ సాయంతో పైకి లాగారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యక్తి హఠాన్మరణం


