క్రీస్తు మందిరాలు.. వేడుకల నిలయాలు
● ఏళ్లుగా ప్రత్యేక ప్రార్థనలు ● ఆధ్యాత్మికత పంచుతున్న చర్చీలు
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం ఆధ్యాత్మిక సౌరభాలతో విరాజిల్లుతోంది. పట్టణంలో అన్ని మతాల ప్రార్థన మందిరాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. ఇక్కడ పురాతన ఆలయాలతోపాటు ప్రార్థన మందిరాలు సైతం ఉన్నాయి. పట్టణంలో రెండు ప్రధాన చర్చీలకు అర్ద శతాబ్దానికి పైగానే చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు.
సుభాష్‌నగర్ సీఎస్‌ఐ చర్చి
పట్టణంలోని సుభాష్‌నగర్ సీఎస్‌ఐ చర్చి అతి పురాతనమైనది. దీనిని స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే స్థాపించినట్లు స్థానికులు చెబుతుంటారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో సిరిసిల్లలో సీఎస్‌ఐ చర్చిని ఏర్పాటు చేశారు. ఏటా సెప్టెంబర్ 27న సీఎస్‌ఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రతీ ఏడాది నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్యం క్రీస్తు ప్రార్థనలతో, సామాజిక కార్యక్రమాలను చర్చి నిర్వాహకులు చేపడుతున్నారు. ప్రస్తుతం వెల్లెస్లీ పాస్టర్‌గా కొనసాగుతున్నారు.
బీవైనగర్ బెతెస్థ బాప్టిస్టు చర్చి
జిల్లా కేంద్రం కార్మికవాడల్లో సుమారు యాబై ఏళ్ల క్రితం రిజరక్షన్ లైఫ్ మినిస్ట్రీస్ బెతెస్థ బాప్టిస్టు చర్చిని స్థాపించారు. తొలినాళ్లలో అద్దె గృహంలో నిర్వహించగా.. 1982లో సొంత భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి పాస్టర్ పీఠర్ చర్చి నిర్వహణ బాధ్యతలు చూసుకోగా.. 1999 నుంచి పాస్టర్ రెవరెండ్ సామ్‌కల్వల చూసుకుంటున్నారు. ప్రతీ ఏడాది సామాజిక కార్యక్రమాలు, ఏడాది పొడవున మందిరంలో యేసుక్రీస్తు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పేద పిల్లలకు చదువు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలతోపాటు ప్రతీ ఏడాది క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ సామ్‌కల్వల తెలిపారు.
అనంతారంలో 1972లో నిర్మాణం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వివిధ గ్రామాల్లోని చర్చీలు క్రిస్మస్ వేడుకకు ముస్తాబయ్యాయి. మండలంలోని అనంతారం సీయోను ప్రార్థన మందిరం 1972లో నిర్మించినట్లు చర్చి ఫాదర్ ఎరువెల్లి ఇస్సాక్ తెలిపారు. మండలంలో ఇది మొదటి చర్చిగా చెప్పుకుంటారు.
తడగొండలో 35 ఏళ్లుగా..
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ, బోయినపల్లి, విలాసాగర్, మల్కాపూర్, స్తంభంపల్లి, కొత్తపేట, మర్లపేట గ్రామాల్లో చర్చీలు ఉన్నాయి. తడగొండలో 1990లో నిర్మించారు. అప్పటి నుంచి ఏటా ఇక్కడ డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
విద్యుత్‌దీపాలతో అలంకరణ
ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంతోపాటు గొల్లపల్లి, నారాయణపూర్ గ్రామాల్లోని చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్‌కాంతుల్లో ప్రార్థన మందిరాలు జిగేలుమంటున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయని నిర్వాహకులు తెలిపారు.
క్రీస్తు మందిరాలు.. వేడుకల నిలయాలు
క్రీస్తు మందిరాలు.. వేడుకల నిలయాలు
క్రీస్తు మందిరాలు.. వేడుకల నిలయాలు


