వ్యవసాయం.. జీవన విధానం
కరీంనగర్: వ్యవసాయం వృత్తి కాదు.. జీవన విధానమని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాను ప్రారంభించారు. స్టాల్స్‌ను సందర్శించారు. అధునాతన వ్యవసాయ యంత్రాలు, సీడ్స్, డెయిరీ, ఆర్గానిక్ స్టోర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకోసం రైతులు సంఘటితంగా మారాలన్నారు. తమ భూములను భూసార పరీక్ష చేసుకొని, తగిన మోతాదులో ఎరువులు వాడటం ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. కిసాన్ జాగరణ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, యువత వ్యవసాయం, ఇతర చేతివృత్తుల పైపు కాకుండా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వైపు వలసలు వెళ్తున్నారని అన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు, వారిని చైతన్యపరచుటకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు సమగ్ర వ్యవసాయం వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన రైతు రక్షణవేదిక యూట్యూబ్ చానల్‌ను దత్తాత్రేయ చేతుల మీదుగా ప్రారంభించారు. వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ట్రాన్స్‌పోర్ట్ చైర్మన్ సమ్మిరెడ్డి, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు మల్లేశం యాదవ్, మారుతి, బ్రహ్మం, శ్రీకాంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షం
హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కరీంనగర్‌లో కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం


