ధాన్యం కమీషన్ రూ.9.77కోట్లు
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ బాధ్యులకు కమీషన్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం పంపిణీ చేశారు. జిల్లాలో 2023–2024 ఖరీఫ్(వానాకాలం) సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, రబీ(యాసంగి)కి సంబంధించి రూ.7,86,91,920 కమీషన్ చెక్కులను అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి బి.చంద్రప్రకాశ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, డీసీఎంఎస్ ఇన్‌చార్జి శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య పాల్గొన్నారు.
వేసవిలో నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు
వేములవాడ: రాబోవు వేసవిలో నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్‌ను బుధవారం అధికారులతో కలిసి సందర్శించారు. ప్లాంట్‌లోని ఫిల్టర్‌హౌస్, వాటర్‌ప్లాంట్ మోటార్లను పరిశీలించారు. మోటార్ కాలిపోయిన విషయంపై ఈఎన్సీ కృపాకర్‌తో మాట్లాడి బాగు చేయించాలని సూచించారు.


