ఇసుక రవాణా అడ్డగింత
కోనరావుపేట(వేములవాడ): ఇష్టం వచ్చిన రీతిలో ఇసుక రవాణా చేయడంతో వాగులోని తాగునీటి బావికి ప్రమాదం పొంచి ఉందంటూ మండలంలోని కనగర్తి గ్రామస్తులు బుధవారం ఇసుక రవాణాను అడ్డుకున్నారు. స్థానిక మూలవాగు నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు అనుమతులు జారీ చేయడంతో ధర్మారం, సుద్దాల, మంగళ్లపల్లి, పల్లిమక్త, నాగారం గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు ఇసుక కోసం వచ్చాయి. దీంతో సర్పంచ్ మల్యాల స్వామిదాసు ఆధ్వర్యంలో గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. వాగులో ఉన్న తాగునీటి బావి వద్ద ఇసుకను తోడవద్దని చెప్పినా వినడం లేదన్నారు. ఏఎస్సై తిరుమల్‌బాబు సిబ్బందితో చేరుకుని రైతులతో మాట్లాడారు.సర్పంచ్ స్వామిదాసు, ఉపసర్పంచ్ శేఖర్, ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ భూంరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.
దుమ్ము లేస్తోంది..
కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లు వేగంగా వెళ్తున్నాయని గ్రామస్తులు అడ్డుకున్నారు. స్కూళ్లకు సెలవులు ఉన్నాయని.. చిన్నారులు రోడ్లపైకి వస్తుంటారని నెమ్మదిగా వెళ్లాలని చెప్పినా ట్రాక్టర్ డ్రైవర్లు వినడం లేదన్నారు. కనీసం రోడ్డుపై నీళ్లు చల్లకుండానే వెళ్తుండడంతో దుమ్ము లేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.


