నానీ లే.. అన్నం పెడతా
సిరిసిల్లటౌన్: నానీ లే నానీ..ఆకలి అన్నావుగా..అన్నం పెడతా..ఆడుకునేటోన్ని నేను స్ట్రాంగ్ అంటావుగా ఇలా పడిపోయావు..లే నాన్న అంటూ.. ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటనీరు పెట్టించింది. బడి నుంచి వచ్చి ఆటకని బయటకు వెళ్లిన చిన్నారి సెప్టిక్‌ట్యాంకు తొట్టిలో పడి మృతిచెందిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మామిడి లావణ్య–శ్రీనివాస్ దంపతులకు నికేశ్(6) కొడుకు. లావణ్య అనారోగ్యంతో పట్టణంలోని సర్దార్‌నగర్‌లో తల్లి వద్దే ఉంటూ.. కొడుకును చదివిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదివే నికేశ్ రోజు మాదిరిగానే బడికెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆడుకునేందుకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లి లావణ్య కొడుకు కోసం ఆ ఏరియా మొత్తం గాలించింది. అదే ప్రాంతంలో కుసుమ శ్రీనివాస్ కొత్త ఇల్లు కడుతున్నాడు. సెప్టిక్‌ట్యాంకులో ఏదో పడిందని చూస్తుండగా బాలుడు పడిపోయినట్లు గమనించి స్థానికుల సాయంతో బయటకు తీయించారు. లావణ్య అక్కడికి చేరుకొని అచేతన స్థితిలో ఉన్న కొడుకుని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సెప్టిక్‌ట్యాంకు తొట్టికి మూత లేకపోవడంతో ఆ ప్రదేశానికి ఆటకు వచ్చిన నికేశ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.


