భక్తులకు అన్ని వసతులు కల్పించాలి
● విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మామిడిపల్లిలో జరిగే మాఘమావాస్య జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దత్తత శ్రీసీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనవరి 18న మాఘ అమావాస్య జాతర సమయానికి నిర్దేశించుకున్న పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాలకు సుమారు 50వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆధ్యాత్మికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడా లోపాలు జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంపులు, తాగునీటి కోసం ఎక్కడికక్కడ చల్లివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని, వంటశాల నిర్మించాలని సూచించారు. అలాగే 10 వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం
మామిడిపల్లి ఆలయంలో చేస్తున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు దాటినా ఘాట్‌రోడ్డు పనులు ఎందుకు జరుగడంలేదని ప్రశ్నించారు. త్వరగా పనులు ప్రారంభించకుంటే బిల్లులు ఆగుతాయన్నారు. ఈవో రమాదేవి, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధరెడ్డి, సర్పంచులు పన్నాల లక్ష్మారెడ్డి, షేక్ యాస్మిన్‌పాషా, బోయిని దేవరాజు, భుక్యా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


