పెద్ద పంచాయతీల్లో భారీగా ఖర్చు
జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతీల్లో ఎన్నికల ఖర్చు రూ.కోట్లతో సాగాయి. మొదటి విడత ఎన్నికలు జరిగిన ఓ మేజర్ గ్రామంలో ప్రధాన పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు ఒక్కొక్కరు తలా రూ.1.20 కోట్లు ఖర్చు చేశారు. వార్డు సభ్యులుగా పోటీచేసిన వారు రూ.3లక్షల వరకు ఖర్చు చేసి ప్రచారం చేశారు. ఒక్క ఊరిలోనే రూ.4 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. రెండో విడతలో ఎన్నికలు జరిగిన మరో మేజర్ పంచాయతీలోనూ ఒక్క ఊరిలోనే రూ.3కోట్ల మేరకు వెచ్చించారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి 5వేల మంది ఓటర్లకు రూ.1,500 చొప్పున రూ.75లక్షలు పంపిణీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థి, మళ్లీ ఎన్నికల రోజు ఓటింగ్ సాగుతుండగానే మరోసారి ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. ఒక్క అభ్యర్థి రూ.1.20 కోట్ల మేరకు వెచ్చించారు. ఈసారి ఎన్నికలకు దసరా పండగకు ముందే ఓసారి నోటిఫికేషన్ రావడంతో కొందరు అప్పుడే కొంత ఖర్చుపెట్టారు. ఆ నోటిఫికేషన్ రద్దు కావడంతో అప్పుడు చేసిన ఖర్చు అభ్యర్థులపై అదనంగా పడింది.


