ప్రొటోకాల్ ‘వార్’
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల ఘర్షణ ● పోలీసుల లాఠీచార్జీ ● ఇరువర్గాలపై కేసులు
సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రొటోకాల్ వార్ ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట బాహాబాహీకి దిగారు. ఇరువర్గాలను కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఎడమ చేయి విరుగగా, పార్టీ యూత్ నాయకులు సబ్బని హరీశ్, చంటీలకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు జాలగం ప్రవీణ్(టోనీ), మునిగెల రాజు, బైరినేని రాము, కోడం అమర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై బైటాయించిన బీఆర్‌ఎస్ నాయకులనూ తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
పొలిటికల్ వార్
సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు మంజూరుపత్రాల పంపిణీ కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫొటోలు పెడుతున్న అధికారులు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టడం లేదు. ఈ విషయమై సర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో ఎస్పీ మహేశ్ బీ గీతేకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ఫొటో పెట్టకపోతే కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో లేదని.. పెడతామని అక్కడికి రాగా తోపులాట జరిగింది.
‘కాంగ్రెస్ గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది’
కాంగ్రెస్ పార్టీ గిచ్చి కయ్యం పెట్టుకుంటోందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ నాయకులు దాడిని ఖండించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నివాసంలో సీఎం ఫొటోలు ఎలా పెడతారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసుల లాఠీచార్జీ ఖండించారు.
దాడి దారుణం
కేటీఆర్ క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని వేములవాడ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి వీడాలని, అధికారులు రాజ్యాంగ బద్ధంగా ఉండాలన్నారు.
గుండాల రాజ్యం
– బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్ల/తంగళ్లపల్లి: తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గుండా రాజ్యం సాగుతోందన్నారు. పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరించడంతోనే కేటీఆర్ క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెసోళ్లు దాడి చేశారని ఆరోపించారు. ముందుస్తు సమాచారం ఉన్నా కట్టడి చేయకుండా.. దాడులకు ఉసిగొల్పారని విమర్శించారు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఐదుసార్లు తిరస్కరించినా కేకే మహేందర్‌రెడ్డిని కలెక్టర్ వెంటబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పా ల్గొనడం సరికాదన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలువలేని ఆయనకు ప్రొటోకాల్ ఏంటని? ప్రశ్నించారు. ప్రొటోకాల్ వివాదం శాంతిభద్రతల సమస్య అవుతుందని ముందే ఎస్పీకి ఫిర్యాదు చేశామని చక్రపాణి గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ‘సెస్’ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, బీఆర్‌ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్, రాఘవరెడ్డి, సిద్ధం వేణు, మాట్ల మధు, సబ్బని హరీశ్, చంటి, కృష్ణారెడ్డి, చంద్రయ్యగౌడ్, బండ నర్సయ్యయాదవ్, గజభీంకార్ రాజన్న, బాలయ్య, మల్యాల దేవయ్య, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ ‘వార్’


