‘ఉపాధి’పై నిఘా
● పనుల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలు ● ఐదుగురు సభ్యులతో ఏర్పాటుకు నిర్ణయం ● అక్రమాలకు తావులేకుండా పనులు
చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పథకం పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉపాధిహామీ పథకం పనులపై నిఘా పెట్టేందుకు గ్రామాల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. పనుల పర్యవేక్షణతోపాటు అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు చేపట్టేందుకు విలేజీ మానిటరింగ్ కమిటీ(వీఎంసీ)కి పూర్తిస్థాయిలో అధికారాలను కట్టబెట్టింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
మానిటరింగ్ సభ్యుల నియామకానికి నిబంధనలు
● జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రతీ గ్రామపంచాయతీకి ఆదేశాలు జారీచేశారు.
● ఈ కమిటీల్లో అంగన్‌వాడీ టీచర్, యూత్ సభ్యులు, స్కూల్‌టీచర్, గ్రామైక్య సంఘం సభ్యురాలు, ఈజీఎస్ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
● పంచాయతీల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదిస్తూ ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు నివేదికలు పంపించారు. ఈ కమిటీలు దాదాపు ఆరు నెలలపాటు పనిచేసేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.
98 వేల కుటుంబాలకు జాబ్‌కార్డులు
జిల్లాలోని 255 గ్రామపంచాయతీల పరిధిలో 98వేలకుపైగా జాబ్‌కార్డులు ఉన్నాయి. 1,98,564 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 64వేల జాబ్‌కార్డులు యాక్టివేట్ కాగా ఒక లక్ష మంది వరకు పనులకు హాజరవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
కమిటీ విధులు ఇవీ..
ఉపాధిహామీ పనులను వారంలో ఒక్కసారైనా పర్యవేక్షించే బాధ్యత విలేజీ కమిటీలపై ఉంది. పనుల నిర్వహణపై కూలీలతో చర్చించాలి. ఉపాధిహామీ పనుల నిర్వహణ, సౌకర్యాలు పరిశీలించడంతోపాటు పనుల్లో నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, చేపట్టిన పనులపై నివేదికలు అందజేయడం కమిటీల బాధ్యత.
కమిటీలు ఏర్పాటు చేశాం
జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఉపాధిహామీ పథకం పనుల్లో అవతకవకలకు తావు లేకుండా పర్యవేక్షించేందుకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను కమిటీ సభ్యులకు అప్పగించాం. పనులు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి.
– శేషాద్రి, డీఆర్‌డీవో
‘ఉపాధి’పై నిఘా


