వాస్తవాలు మాట్లాడితే వణుకెందుకు..?
సిరిసిల్ల: రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ.. ప్రజాపాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ వణికిపోతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుంచాం. ఉద్యోగ సంఘాలు, కొన్ని వర్గాల డిమాండ్లను ఇప్పుడు తీర్చలేమని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పారదర్శకంగా కుండలు బద్దలు కొట్టినట్లు చెబితే, బీఆర్‌ఎస్, బీజేపీ ఒకరికి ఒకరు వంతపాడుతూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్‌కు అధికారమిస్తే అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఒక్క పరిశ్రమను తెచ్చారా, ఎవరికై నా ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. జిల్లాలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న కాలంలో కొనుగోలు చేసిన ధాన్యం కంటే.. ఇప్పటికే తాము ఎక్కువ కొనుగోలు చేశామని, ఇంకా చేస్తున్నామని గణాంకాలతో వివరించారు. రైతులకు మూడు రోజుల్లోనే పేమెంట్ ఇస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రజల్లో ఉంటూ, రైతులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. వాస్తవాలను జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ కమిట్‌మెంట్ ఏంటో ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, నాయకులు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, కాముని వనజ, గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


