స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం కట్టండి
● మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ● అనంతారంలో ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’కు స్పందన
ఇల్లంతకుంట: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆన్‌వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానకొండూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పొందాలంటే కేవైసీ చేయించాలన్నారు. అనంతారంలో గతంలో వ్యక్తిగతంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించుకున్నవారు సంబంధిత అధికారులతో ఎంబీ రికా ర్డు చేయించుకుంటే నిధులు మంజూరు అవుతాయ ని తెలిపారు. గ్రామంలో లూజ్‌వైర్లను సరి చేయాలని సెస్ ఏఈ నగేశ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అనంతారం బిక్కవాగుపై నిర్మించిన బ్రిడ్జి పూర్తి చేసేందుకు రూ.44లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సీసీరోడ్లకు రూ.25లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమిపూజ జూన్ 5వ తేదీన అనంతారం నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కే.భాస్కర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ సుదర్శన్‌రెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తహసీల్దార్ ఎంఏ.ఫారూఖ్, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు.


