‘వర్కర్లను ఓనర్లు’గా మార్చాలి
● నేతన్నలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఏవీ ● ధనిక, పేదల మధ్య వ్యత్యాసం పెరిగింది ● మాజీ ఎంపీ వినోద్‌కుమార్
సిరిసిల్ల: నేతకార్మికులను ఓనర్లుగా మార్చాలని, ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలో గురువారం బీఆర్‌టీయూ నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దూరు బైపాస్ వెంట వర్కర్లను ఓనర్లు మార్చేందుకు షెడ్లను నిర్మించి, వసతులు కల్పించిందన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈపాటికి వర్కర్లు ఓనర్లు అయ్యేవారన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను ఓనర్లను చేయాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. నేతన్నలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కరువైందన్నారు. కార్మికులకు రూ.5లక్షల బీమా సదుపాయాన్ని తాను ఎంపీగా ఉండగా.. పార్లమెంట్‌లో ఆమోందించామని గుర్తు చేశారు. కార్మిక వర్గాలు అసంఘటితంగా ఉండడంతోనే ఇంకా పేదరికంలో ఉన్నారని, హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, ఆకునూరి శంకరయ్య, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్, రాఘవరెడ్డి, బండ నర్సయ్యయాదవ్, గుండ్లపల్లి పూర్ణచందర్, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పోరండ్ల రమేశ్, బత్తుల వనజ, గొట్టె దేవేంద్ర, కమలాకర్, అగ్గిరాములు పాల్గొన్నారు.
కార్మికులకు సన్మానం
సిరిసిల్లలోని వివిధ వర్గాల కార్మికులను మేడే సందర్భంగా సన్మానించారు. వచ్చే ఏడాది వేలాది మందితో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు చేయాలని, బీఆర్‌ఎస్ పార్టీ జెండా కాకుండా.. ఎర్ర జెండాను ఎగురవేయాలని వినోద్‌కుమార్ సూచించారు.


