చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. మంగళవారం మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలలో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞానసదస్సులో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఎప్పటికీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఉచిత న్యాయసేవాకేంద్రం ఉందని, నిరుపేదలు సహాయం పొందవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులను పరిష్కరించుకుంటే కేసు కొట్టేయడంతో పాటు ఆ కేసుల్లో కోర్టుకు కట్టిన ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుందన్నారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్‌రావు, ప్రిన్సిపాల్ రాంసూరత్‌యాదవ్, న్యాయవాదులు ఆడెపు వేణు, పెంట శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.


