● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల: జిల్లాలో టోకెన్ పద్ధతిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 2.50లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా ఉందన్నారు. ఈసారి ఐకేపీ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని అన్నా రు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, తేమ యంత్రాలు ,ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్‌లు కొనుగోలు కేంద్రాలకు ఎన్ని అందిస్తున్నారో పూర్తి వివరాలు నివేదిక అందించాలని ఆదేశించారు. డీఎస్‌వో పి.వసంతలక్ష్మీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి.రజిత, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘సెస్’ పరిధిలో సోలార్ హబ్
● ఇండో– జర్మన్ సహకారంతో జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు
● డీపీఆర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాలు
సిరిసిల్ల: ఇండో– జర్మన్ సహకారంతో జిల్లాలో విద్యుత్ పంపిణీ చేసే సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల భాగస్వామ్యంతో సోలార్ హబ్‌గా మార్చేందుకు జర్మన్ సహకారం పొందనున్నారు. గత ఏడాది వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి రాష్ట్ర సహకార, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశారు. అంతర్జాతీయ వ్యవసాయ సహకార సంస్థ(ఐఏకే) అగ్రర్ కన్సల్టింగ్ జీఎంబీహెచ్ జర్మనీ సంస్థ చీఫ్ స్వెన్ గెల్హార్ నేతత్వంలో మంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావుతో చర్చించారు. తెలంగాణ లో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో పునరుత్పాదక శక్తికి, సౌరశక్తి(సోలార్)గా మార్చడానికి సెస్ పరిధిలోని 253,501 విద్యుత్ వినియోగదారులను సౌరశక్తి ఉత్పత్తిదారులుగా మార్చడం లక్ష్యంగా పాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు, ఇండో–జర్మన్ సహకారంతో జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (కేఎఫ్‌డబ్ల్యూ) ద్వారా వస్తాయని అంచనా వేశారు. సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో సోలార్‌హబ్ ప్రాజెక్టుకు డీపీఆర్‌ను సమర్పించాలని మంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలో ‘సెస్’ విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది.
టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు