● కలెక్టర్ మార్క్ బదిలీలు ● 9 మంది తహసీల్దార్లు.. 14 మంది డిప్యూటీ తహసీల్దార్లకు స్థానచలనం ● అదనపు కలెక్టర్ విధుల్లో చేరిన మరుసటి రోజే చర్యలు ● భారీ బదిలీలతో రెవెన్యూలో కుదుపు
సిరిసిల్ల: జిల్లా రెవెన్యూశాఖ బదిలీలతో కుదుపునకు గురైంది. ఏకకాలంలో ఇంత పెద్ద సంఖ్యలో అధికారుల బదిలీలు జరగడం ఈమధ్య కాలంలో ఇదే కావడం విశేషం. జిల్లా ఆవిర్భవించినప్పటి నుంచి ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. 9 మంది తహసీల్దార్లు, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ మార్క్ బదిలీలు అనే చర్చ సాగుతోంది. ఇటీవల బదిలీపై వచ్చి విధుల్లో చేరిన వారిని సైతం మళ్లీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో రెవె‘న్యూ’ అధికారులే కనిపిస్తున్నారు.
బదిలీ అయిన డిప్యూటీ తహసీల్దార్లు వీరే..
జిల్లాలో 14 మంది డిప్యూటీ తహసీల్దార్(డీటీ)లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీర్నపల్లి డీటీ డి.మారుతీరెడ్డిని గంభీరావుపేటకు బదిలీ చేస్తూ తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్‌లో ఎలక్షన్స్(ఎపిక్) విభాగంలో పనిచేసే ఎండీ ముక్తార్‌పాషాను వీర్నపల్లికి బదిలీ చేస్తూ తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గంభీరావుపేట డీటీ సయ్యద్ అఫ్జల్ రహమాన్‌ను కలెక్టరేట్ ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. ప్రత్యేక ఉపకలెక్టర్ ఆఫీస్‌లో డీటీగా పనిచేసే వి.మురళీకృష్ణను ఎల్లారెడ్డిపేట డీటీగా నియమించారు. కలెక్టరేట్‌లోని పౌరసరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే సీహెచ్ రవీంద్రాచారిని కలెక్టరేట్‌లోని ఎస్‌డీసీ ఆఫీస్‌లో డీటీగా, బోయినపల్లి డిప్యూటీ తహసీల్దార్ ఎ.దివ్యాజ్యోతిని సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డీటీగా నియమించారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే జి.అపర్ణను ముస్తాబాద్ డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. ముస్తాబాద్ డీటీ ఎన్.భూపేశ్‌కుమార్‌ను బోయినపల్లి డీటీగా, కలెక్టరేట్‌లో పౌరసరఫరాల విభాగంలోని డీటీ కె.నవీన్‌కుమార్‌ను సిరిసిల్ల ఎస్‌డీసీ ఆఫీస్‌లో డీటీగా నియమించారు. సిరిసిల్ల ఎస్‌డీసీ ఆఫీస్‌లోని డీటీ కె.సురేశ్‌కుమార్‌ను వేములవాడ డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ చేశారు. వేములవాడ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసే జి.రజితను కలెక్టరేట్ పౌరసరఫరాల విభాగం డీటీగా నియమించారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డీటీగా పనిచేసే కె.మోహన్‌రావును రుద్రంగి డీటీగా, రుద్రంగి డీటీగా పనిచేసే బి.యాదగిరిని సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియమించారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా
జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచ ముంపు గ్రామం వరకు మానేరువాగు వెంబడి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇల్లంతకుంట మండలంలో బిక్కవాగు, కోనరావుపేట మండలంలో మూలవాగు పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా రాత్రి వేళల్లో సాగుతోంది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా.. దందా సాగుతూనే ఉంది. మరోవైపు మొరం తరలింపులు, అక్రమ మైనింగ్‌లు సాగుతున్నాయి. మరోవైపు రేషన్‌బియ్యం పక్కదారి పట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమాలపై కేసులు నమోదుచేస్తున్నారు. రేషన్‌బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పనిని పోలీసులు చేస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం వైఫల్యంతోనే ఇవి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను ఎత్తిచూపడంలో రెవెన్యూ అధికారులు విఫలమైనట్లు ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టేందుకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా భారీ ఎత్తున బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు భావిస్తున్నారు.
అదనపు కలెక్టర్ విధుల్లో చేరిన వెంటనే...
జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ 45 రోజులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లి.. సోమవారం విధుల్లో చేరారు. ఆయన విధుల్లో చేరిన మరుసటి రోజే 9 మంది తహసీల్దార్లను, 14 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ సెలవులో ఉండగా ఆ బాధ్యతలను పర్యవేక్షించిన కలెక్టర్ రెవెన్యూ అధికారుల పనితీరును నిషితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూశాఖలో భారీగా బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. జిల్లాలో మరికొందరు రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐలు, రెవెన్యూ ఆఫీస్‌లో సిబ్బందిని కూడా బదిలీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.