● వర్కర్ టు ఓనర్ పథకం ప్రారంభించాలి
● రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు. జిల్లా కేంద్రం నెహ్రూనగర్‌లోని అంభా భవాని ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లలో లక్షలాది మంది కార్మికులు నివసిస్తున్నారని, వైద్యం కోసం ఈఎస్‌ఐ హాస్పిటల్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, పవర్‌లూమ్ కార్మికుల కోసం వర్కర్ టు ఓనర్ పథకానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.
సీయూ భూములు అమ్మొద్దు
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములు విక్రయించాలని రాష్ట్ర సర్కారు చూస్తోందన్నారు. యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, ఎర్రవల్లి నాగరాజు, ముక్తి కాంత అశోక్, అన్నల్‌దాస్ గణేష్, మల్లారపు ప్రశాంత్, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
టెక్స్‌టైల్‌పార్క్ సందర్శన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్‌టైల్ పార్కును ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి టెక్స్‌టైల్ పార్కు పరిస్థితి ప్రస్తుతం దీనావస్థలో ఉందన్నారు. వేలాది కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన టెక్స్‌టైల్ పార్కులో సగానికిపైగా పరిశ్రమలు మూతబడి ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి టెక్స్‌టైల్ పార్కులో మూతబడిన పరిశ్రమలు తెరిపించాలని కోరారు.
‘గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుంది’
ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.


