బినామీల జోరు | Sakshi
Sakshi News home page

బినామీల జోరు

Published Sat, Mar 18 2023 12:06 AM

ఆలయంలో భక్తులు  - Sakshi

● వివిధ వర్గాలు, ప్రముఖుల పేర్లతో వీఐపీ దర్శనాలు ● రాజన్న ఆలయ ఆదాయానికి గండి ● అధికారులు దృష్టిసారించాలని డిమాండ్‌

వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో బీనామీల జోరు పెరిగింది. తమ డిపార్ట్‌మెంట్లు, వివిధ వర్గాలు, ప్రముఖుల పేర్లతో వీఐపీ దర్శనాలు చేయించుకుంటూ రాజన్న ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఉద్యోగ వర్గాలు చర్చలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు వెచ్చించి గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూస్తున్న భక్తుల ముందే సదరు వీఐపీలు ఉచితంగా రాజన్నను దర్శించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ ఉద్యోగం, సామాజిక సేవ చేయని వ్యక్తులు సైతం నేరుగా ఆలయంలోకి తమవారిని దర్శనాలకు తీసుకెళ్తున్నట్లు ప్రచారం..

పలుకుబడితో..

రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగా టికెట్లు తీసుకుంటారు. అయి తే కొందరు బినామీలు తమ పలుకుబడిని ఉపయోగించుకొని దందా మొదలు పెడుతున్నారు. ఆలయానికి ఎలాంటి సంబంధం లేకున్నా తమవారికి దర్శనాలు చేయించుకుంటున్నట్లు తెలు స్తోంది. జర్నలిస్టులు, ఇతరుల పేర్లు చెప్పుకుంటూ ఉద్యోగులను బెదిరిస్తూ యథేచ్ఛగా దర్శనా లు చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారులు దృష్టిసారించాలి

కొందరు ఉన్నతాధికారుల పేర్లు, వారి బంధువులుగా చెప్పుకుంటూ ఇతర భక్తులను దైవ దర్శనాలకు తీసుకెళ్తున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వీరికి ఎలాంటి అర్హతలు లేకున్నా నేరుగా ఆలయంలోకి తీసుకెళ్తూ వీఐపీలుగా గౌరవిస్తున్నట్లు ఉద్యోగుల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై అధికారులు దృష్టిసారించి బినామీల బెడద లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

డ్రెస్‌కోడ్‌ అమలు చేయాలి

ఆలయంలో ఎవరు పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు. ఉద్యోగులెవరో, బయటి వ్యక్తులెవరో తెలియకుండా పోతోంది. ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌ అమలు చేయాలి. అలాగే ప్రతి ఉద్యోగి మెడలో గుర్తింపుకార్డు ఉండేలా చూడాలి. గతంలో ఈవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. కలెక్టర్‌ స్పందించి చొరవ తీసుకుంటే బాగుంటుంది.

– నందిపేట సుదర్శన్‌ యాదవ్‌, మాజీ ధర్మకర్త

అనుమతులు లేకుండా రానివ్వం

రాజన్న ఆలయంలో స్వచ్ఛందంగా సేవచేసే వ్యక్తులైనా సరే ఆలయ ఈవో అనుమతి తీసుకున్న తర్వాతే విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీచేస్తాం. అనుమతులు లేకుండా ఎవరూ ఆలయంలో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. డ్రెస్‌కోడ్‌, ఐడీకార్డులు ధరించే విషయంపై ఉద్యోగులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. – కృష్ణప్రసాద్‌, ఆలయ ఈవో

1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement