అమ్మేందుకు పత్తి లేదు.. అప్పు తీరే దారి లేదు! | - | Sakshi
Sakshi News home page

అమ్మేందుకు పత్తి లేదు.. అప్పు తీరే దారి లేదు!

Nov 29 2026 1:20 AM | Updated on Nov 29 2026 1:20 AM

మార్కాపురం:

ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి మరీ పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈ ఏడాది కన్నీళ్లే మిగిలాయి. మార్కెట్లో పత్తి ధరలు ఊరిస్తున్నా.. అమ్ముకోవడానికి చేతిలో పంట లేకపోవడంతో రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. ఓవైపు ఆకాశాన్నంటిన పెట్టుబడులు, మరోవైపు దారుణంగా పడిపోయిన దిగుబడులు పత్తి రైతుల నడ్డి విరిచాయి. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 19,883 హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రైతులు కేవలం 11,048 హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. లక్ష్యానికి తగినట్లుగా సాగు విస్తీర్ణం లేకపోవడం వ్యవసాయ రంగంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది. సాగు చేసిన కొద్దిపాటి విస్తీర్ణంలోనూ ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.

రైతులకు రూ.12 కోట్ల నష్టం

సాధారణ దిగుబడులతో పోలిస్తే ఈసారి పత్తి పంటలో తీవ్ర తగ్గుదల నమోదైంది. అనేక ప్రాంతాల్లో ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి పడిపోయినట్లు రైతులు వాపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు తడిసిమోపెడవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని దయనీయ స్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులకు సుమారు రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. అప్పులు చేసి సాగు చేసిన రైతులు, కనీసం వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు.

ధర ఉన్నా.. పంట ఏదీ?

ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర ప్రకటించగా, బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.9,500 వరకు ధర పలుకుతోంది. సాధారణంగా ఇంత మంచి ధర దక్కితే రైతుల ఇంట ఆనందం వెల్లివిరియాలి. కానీ, విక్రయించడానికి సరిపడా దిగుబడి లేకపోవడంతో ఆ అధిక ధరలు రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయాయి. ధరల లాభం కంటే దిగుబడి నష్టమే అన్నదాతలను నిలువునా ముంచేసింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 23,685 మంది రైతులు తమ పరిస్థితి తలచుకుని మదనపడుతున్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు అడుగడుగునా కష్టాలే ఎదురయ్యాయని, ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు స్పందించి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

క్వింటా పత్తి కూడా చేతికి రాలేదు

ఈ ఏడాది నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో పత్తి పంట పూర్తిగా పోయింది. 1.50 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. సమయానికి వర్షాలు లేకపోవడంతో పంటంతా ఎండిపోయింది. సాధారణంగా అయితే కనీసం ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ, ఈసారి కనీసం క్వింటా కూడా చేతికి రాలేదు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలి.

– కె.శివారెడ్డి, రైతు, పుచ్చకాయలపల్లి

మార్కెట్లో ధరలు ఊరిస్తున్నా..

చేతిలో పంట లేక అన్నదాత విలవిల

మార్కాపురం జిల్లాలో పత్తి రైతులకు రూ.12 కోట్ల మేర నష్టం

21 మండలాల్లో 23,685 మంది

అన్నదాతలపై తీవ్ర ప్రభావం

ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు

పడిపోయిన దిగుబడి

మద్దతు ధర రూ.8,667.. మార్కెట్‌

ధర రూ.9,500 పలుకుతున్నా

దక్కని ఫలితం

19,883 హెక్టార్ల లక్ష్యానికిగాను 11,048 హెక్టార్లలోనే పంట సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement