● ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించింది
● విదేశాల్లో ఉన్నవారివి, మరణించిన వారి ఓట్లు ఇక్కడ వేశారు
● ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్, దొంగ ఓట్లు వేశారనేందుకు ఇదే నిదర్శనం
● మా ఏజెంట్‌లు లేకుండానే బ్యాలెట్ బాక్స్‌లను సీల్, స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు
● అక్రమాలపై విచారణ జరిగే వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలి
● ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రికార్డులు భద్రపర్చాలి
● సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు
కందుకూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించడంతో పాటు ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై స్పష్టత వచ్చే వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సబ్ కలెక్టర్ దామెర హిమవంశీని కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం జరిగిన మున్సిపల్ పారదర్శకత పూర్తిగా లోపించిందన్నారు. అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లు, రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడిన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నారు. బూత్‌లను ఆక్రమించి దొంగ ఓట్లు వేస్తున్నా, రిగ్గింగ్ చేస్తున్నా అధికారులు ప్రేక్షపాత్ర వహించారని చెప్పారు. దాదాపు 20 బూతుల్లోని వైఎస్సార్ సీపీ ఏజెంట్‌లను పోలీసులు బయటకు లాగేశారని, వైఎస్సార్ సీపీ నాయకులను హౌస్ అరెస్టు చేసి బూత్‌ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వారి ఓట్లు సైతం ఇక్కడ వేశారని, మరణించిన వారి ఓట్లు కూడా వేసుకున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి ముందుగానే ఓటర్ స్లిప్పులు తెప్పించుకున్న టీడీపీ నాయకులు దొంగ ఐటెండిటీ కార్డులు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ప్రతి బూత్‌లో 300ల నుంచి 500 ఓట్లు దొంగ ఓట్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లు సీల్ చేసే సమయంలో తరలించేటప్పుడు, స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచే సమయంలో కచ్చితంగా పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ఏజెంట్‌లు సంతకాలు తీసుకోవాల్సి ఉన్నా వైఎస్సార్ సీపీ ఏజెంట్‌లు సంతకాలు లేకుండానే బాక్స్‌లను తరలించారన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని, పోలీసులు తమ ఏజెంట్‌లను బంధించడం వల్లె సంతకాలు చేయలేదని వివరిచారు. అన్ని అక్రమాలు చోటుచేసుకున్న ఈ ఎన్నికల ప్రక్రియలో నిబంధనలకు పూర్తిగా పాతరేశారని, అక్రమాలు నిగ్గుతేలే వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి కౌంటర్ ఫైల్‌ను తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రముఖ లాయర్ వసంతలక్ష్మి పాల్గొన్నారు.


