బల్లికురవ: వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా రాకపోవడంతో సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు బలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని కొత్తపాలెంలో శనివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలెంపాటి లక్ష్మీనారాయణ (58) పడమర వైపు తనకు ఉన్న రెండెకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురవడంతో సమీప పొలాల్లోని రైతులు హుటాహుటన గ్రామంలోకి తీసుకొచ్చారు. 108కి సమాచారం ఇవ్వడంతో చికిత్స కోసం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యం అందేలోపు మార్గమధ్యంలోనే చనిపోయాడు. మతునికి భార్య అంజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే రైతు విద్యుత్ షాక్‌తో చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఒక అభ్యర్థి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఎన్నికల్లో పోటీ చేయోచ్చా? అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ న్యాయ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పరుచూరి కుమారినంద ఆ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా పోటీ చేసిన విషయమై ఎన్నికల అధికారులు ఆమైపె తగు చర్యలు తీసుకోవాలని మండల వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారులు విచారణ నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆమె ఏల్చూరు గ్రామ సర్పంచిగా పోటీ చేసిన విషయమై ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ నాయకులు విశ్వవిద్యాలయ వీసీకి వినతిపత్రం ఇచ్చినట్లు సమాచారం.


