మందలో మేసేశారు! | - | Sakshi
Sakshi News home page

మందలో మేసేశారు!

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

నిధుల దుర్వినియోగం జరిగిందిలా..!

సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకంలో బోగస్‌ దందా రుణాల మంజూరు, వసూళ్లలోనూ భారీ అక్రమాలు సొసైటీల్లో 11 వేల మంది ఉంటే వెయ్యి మందికే రుణాలు రూ.25 కోట్లమేర రుణాలు మంజూరు అందులో రూ.8,79,30,724 దుర్వినియోగం అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి.. ముగ్గురు అధికారులపై క్రిమినల్‌ కేసులు బోగస్‌ సొసైటీల వెనుక టీడీపీ నేతల హస్తం

కాపరుల కష్టాలను తీర్చాల్సిన గొర్రెల అభివృద్ధి పథకం కూటమి నేతలకు కాసుల పంట పండించింది. గొర్రెలు మేపేవారి పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి, బినామీలను రంగంలోకి దించి ఎన్‌సీడీసీ నిధులను స్వాహా చేశారు. రూ.25 కోట్ల రుణాల్లో బ్యాంకులకు జమచేసింది రూ.2.50 కోట్లు మాత్రమే. కాపరుల సంక్షేమం కాస్తా నేతల జేబులు నింపే వ్యవహారంగా మారింది.

ఒంగోలు సబర్బన్‌:

గొర్రెలు, మేకలు ఉండవు...కానీ సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకం కింద సొసైటీ మాత్రం ఏర్పాటవుతుంది. ఇలా బోగస్‌ సొసైటీలు పుట్టుకొచ్చాయి. జిల్లాలోని కొన్ని సొసైటీలు పెదాలకు లిప్టిక్‌ వేసుకొని జిల్లా కేంద్రం ఒంగోలుకు వచ్చే అధికార టీడీపీకి చెందిన కొందరు మహిళలు ఈ సొసైటీలు నడుపుతున్నారంటే ఈ పథకం ఎలా పక్కదారి పట్టిందో తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 451 సొసైటీలలో 150కి పైగా నకిలీ సొసైటీలు ఉన్నాయని అధికారులు విచారణలో తేలింది. మొత్తంగా 11 వేల మంది సభ్యులు ఉంటే కేవలం 1000 మందికి మాత్రమే రుణాలు ఇచ్చే విధంగా చేసి ఎన్‌సీడీసీ సొమ్ము నొక్కేశారు. ఈ స్కాం వెనుక అధికార టీడీపీ నేతలు హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు జరిగిన బోగస్‌ సొసైటీల్లో కొన్నింటిని పరిశీలిస్తే విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.

● ఒంగోలు మండలం కొణిజేడులో గణేష్‌ పీఎస్‌బీసీ సొసైటీ. ఈ సొసైటీకి అధ్యక్షురాలు ఐ.పద్మావతి. ఈమె ఏ రోజూ గొర్రెలు కానీ, మేకలు కానీ కాయనే లేదు. కానీ ఈమె సొసైటీ ఏర్పాటు చేసి అధ్యక్షురాలుగా దాదాపు రూ.50 లక్షల వరకూ రుణాలు తీసుకుంది.

● పుల్లల చెరువు మండలం చెన్నంపలికి చెందిన మర్రి రాజా కోటేశ్వరరావు. ఈయన విజయకృష్ణ పీఎస్‌బీసీ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఇతను దాదాపు 15 మంది సభ్యుల పేరుతో రుణాలు తీసుకున్నాడు. ఇతను గతంలో పనిచేసిన ఏడీలకు మధ్యవర్తిగా ఉండి అనేక సొసైటీల్లో రుణాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మందిని మోసం చేశాడు కూడా.

● కనిగిరి మండలం ఎర్రఓబన పల్లి గ్రామానికి చెందిన కాసుల రాఘవ. ఈయన శ్రీ కాటమరాజు పీఎస్‌బీసీ సొసైటీ ఏర్పాటు చేశారు. సదరు సొసైటీలోని 19 మంది పేర్లపై రూ.95 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు జమ చేయలేదు. తాకట్టుపెట్టిన డాక్యుమెంట్లు అన్నీ నకిలీవే.

రూ.8.79 కోట్లకు పైగా స్కాం..

సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకం గ్రూప్‌ లెండింగ్‌ రుణాల పంపిణీలో ప్రభుత్వ నిధులు రూ.8,79,30,724 దుర్వినియోగం అయ్యాయి. సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకం ఏడీ డాక్టర్‌ ఎం. రవి కుమార్‌, అనంతరం ఏడీలుగా పనిచేసిన డాక్టర్‌ కె. సత్యనారాయణ, డాక్టర్‌ సీహెచ్‌ వెంకటరామిరెడ్డిల హయాంలో పెద్ద ఎత్తున నిధులు అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులు నిర్వహించిన విచారణలో తేలింది. రవికుమార్‌ను ఏడాది కిందటే సస్పెండ్‌ చేశారు. ఈ ఏడాది మే నెలలో డాక్టర్‌ కె. సత్యనారాయణ, డాక్టర్‌ సీహెచ్‌ వెంకటరామిరెడ్డిలను సస్పెండ్‌ చేశారు. ఇందులో సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేశారు. వెంకటరామిరెడ్డి విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా విచారణ పూర్తి కావడంతో ఈ స్కాంలో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పశు సంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యం.నాగమణి ఒంగోలు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఒంగోలు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 17వ తేదీన క్రైమ్‌ నంబర్‌–118/2026 కింద కేసు నమోదైంది. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉత్తర్వుల మేరకు తదుపరి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

జాయింట్‌ కలెక్టర్‌ నివేదిక ఆధారంగా...

జాయింట్‌ కలెక్టర్‌ గోపాల కృష్ణ నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత కార్యాలయ రికార్డులు, నగదు పుస్తకాలు, లెడ్జర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, లబ్ధిదారుల రిజిస్టర్లు, రుణాల పంపిణీ రికార్డులు, రసీదు పుస్తకాలు, స్థిర నిక్షేపాలు వివరాలు, ఇతర సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా, సంబంధిత అధికారులు, ఇతర వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేసి సమగ్ర విచారణ నిర్వహించారు. విచారణ పూర్తయిన అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ గోపాల కృష్ణ తన ప్రాథమిక విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

● జిల్లా పశుసంవర్థక శాఖ సహాయక సంచాలకుడిగా ఎం రవికుమార్‌ 2011 మార్చి 24 నుంచి 2016 జూన్‌ 30 వరకు, తిరిగి 2017 మార్చి 4 నుంచి 2021 నవంబర్‌ 30 వరకు పనిచేశారు. ఈయన పనిచేసిన కాలంలోనే రూ.7,88,82,457 ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

● డాక్టర్‌ కె. సత్యనారాయణ 2016 జూలై ఒకటి నుంచి 2017 మార్చి 3వ తేదీ వరకు, తిరిగి 2021 డిసెంబర్‌ 6 నుంచి 2022 జూన్‌ 29వ తేదీ వరకు జిల్లా సహాయ సంచాలకులుగా పనిచేశారు. ఈయన విధులు నిర్వహించిన సమయంలో రూ.79,76,460 ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

● డాక్టర్‌ సీహెచ్‌ వెంకటరామి రెడ్డి 2020 జూలై 1 నుంచి 2025 జూన్‌ 13వ తేదీ వరకు పశుసంవర్ధకశాఖ జిల్లా సహాయ సంచాలకులుగా పనిచేశారు. ఈయన హయాంలో రూ.10,71,807 మేర అక్రమాలు జరిగినట్టు అధికారుల విచారణలో గుర్తించారు.

లెడ్జర్‌లో అనుమానాస్పద నమోదులు

రసీదుల ద్వారా వసూలు చేసిన మొత్తాలను లెక్కల్లో చూపకపోవడం

రుణాల పంపిణీలో విధానపరమైన లోపాలు

బ్యాంకులో జమ చేయాల్సిన నగదు జమ చేయకపోవడం

స్థిర నిక్షేపాలు, వసూళ్లు, బీమా మొత్తాలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు

లబ్ధిదారుల వాటా(షేర్‌ కేపిటల్‌) తక్కువగా వసూలు చేయడం

లబ్ధిదారుల వివరాలు లేకుండా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయడం

ఈ అవకతవకల ద్వారా రూ.8,79,30,724 మేర నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ఈ స్కాం వెనుక అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పెద్దలు హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. రవికుమార్‌ ఎక్కువ కాలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పనిచేశారు. ఆయన పనిచేసిన సమయంలోనే పెద్ద మొత్తంలో రూ. 7.88 కోట్లమేర నిధులు పక్కదారి పట్టాయి. టీడీపీ పెద్దల సహకారంతోనే బినామీ సొసైటీలను ఏర్పాటు చేసుకుని నిధులు మింగేశారు.

కొందరిని అడ్డంపెట్టుకొని మరీ...

సొసైటీల్లోని కొందరినీ అడ్డం పెట్టుకొని అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారు. వాస్తవంగా గొర్రెలు, మేకలు మేపుకొనే వారి పొట్టలు కొట్టి మరీ దోచుకున్నారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ పెడచెవిన పెట్టారు. చివరకు రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు చేస్తే కానీ అధికారుల అడుగులు ముందుకు పడలేదు. సొసైటీల్లో అక్రమంగా రుణాలు పొందిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలి. వాళ్ల నుంచి కాజేసిన సొమ్మును రాబట్టాలి.

– కిలారు పెద్దబ్బాయి, గొర్రెల, మేకల కాపలాదారుల సంఘ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement