అద్దంకి: సర్పంచ్, వార్డులకు నామినేషన్ వేయకుండా అడ్డుకునే అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన అదనపు నామినేషన్ కేంద్రాన్ని గురువారం ఎన్నికల పరిశీలకుడు చక్రధర్‌బాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ జిల్లాలో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రెండో విడతలో అద్దంకి, దర్శి నియోజకవర్గాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండు నియోజకవర్గాలు కలిపి పది మండలాల్లో 198 గ్రామపంచాయతీలు ఉన్నాయని వాటికి సంబంధించి 61 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతితో అద్దంకి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అదనపు నామినేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. గ్రామ పంచాయతీల్లో పార్టీలు ఉండవని, పార్టీలు బలపరిచిన వ్యక్తులు, ఇండిపెండెంట్‌లు ఉంటారని ఆయన తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని, దానిని అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వేయాలని, అవసరం అయితే తప్ప పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు గానీ నామినేషన్ వేసే అభ్యర్థులకు గానీ ఎటువంటి అసౌకర్యం కలిగించిన ఉపేక్షించేది లేదని, దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్లు వేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసుల సహకారంతో ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వేయాలని సూచించారు.ఎస్పీ హర్షవర్ధన రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్ని చిన్నచిన్న ఘటనలు జరిగిన సందర్భంలో అదనపు నామినేషన్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ అనుమతి తీసుకొని ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ ప్రక్రియకు విఘాతం కలిగించే వారిపై శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పంచాయతీ అధికారి అనుపమ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


