ప్రతిపక్షంపై ఖాకీ కర్కశం..
పచ్చ
మూకలకు
కనిగిరి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కనిగిరి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తూ, అధికార టీడీపీకి పూర్తిగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత మున్సిపల్, ప్రాదేశిక, జెడ్పీటీసీ ఎన్నికల్లో పచ్చ నేతల్లా వ్యవహరించిన ఖాకీలు, తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఏకపక్ష ధోరణిని కొనసాగిస్తున్నారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా బుధవారం రాత్రి హెచ్‌ఎంపాడు మండలం నందనవనం నామినేషన్ కేంద్రంలో టీడీపీ ముఠా తిష్టవేసి, వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తొలగిస్తోందని సమాచారం అందింది. దీంతో అక్కడికి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ కనిగిరి ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాసులరెడ్డి, పార్టీ నేత టి.రాజారెడ్డి తదితరులను హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట నామినేషన్ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఎస్సై రాజ్‌కుమార్ తన సిబ్బందితో వాహనాలను నిలిపివేశారు.
ఎస్సై తీరుపై ఆగ్రహం.. రోడ్డుపై బైఠాయింపు
నందనవనం నామినేషన్ కేంద్రం వద్ద వెలిగండ్ల, హెచ్‌ఎంపాడు మండలాలకు చెందిన సుమారు 200 మంది టీడీపీ నాయకులు కూర్చుని ఉమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్‌ను తొలగిస్తుంటే, వారికి ఎన్నికల ఆంక్షలు, శాంతిభద్రతల నిబంధనలు వర్తించవా అని డాక్టర్ దద్దాల నిలదీశారు. కనీసం నామినేషన్ కేంద్రం వద్దకు కూడా వెళ్లనీయకుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఆపుతున్నారని ఎస్సై రాజ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై దుర్మార్గపు తీరుపై ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు వాహనాలకు అడ్డుగా నిలబడటంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాకీల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు, సీఐ ఎం. సుబ్రహ్మణ్యం నేరుగా నామినేషన్ కేంద్రంలోనే కూర్చుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దద్దాల ఆరోపించారు.
అర్ధరాత్రి హైడ్రామా.. కుట్రపూరిత తిరస్కరణ
అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గిన ఎన్నికల అధికారులు నందనవనం కేంద్రంలో హైడ్రామా నడుమ నామినేషన్లను తిరస్కరించారు. తొలుత ఉమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ సక్రమంగానే ఉందని చెప్పిన అధికారులు, ఆ తర్వాత చిన్నపాటి తప్పులున్నాయని, ఆర్డీఓ పరిధిలో పరిశీలన జరగాలని మెలిక పెట్టారు. చివరకు అర్ధరాత్రి 11.45 గంటల తర్వాత ఎంపీడీఓ వచ్చి ఆ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అంతేకాకుండా, వాలిచర్ల, తిమ్మారెడ్డిపల్లి పంచాయతీల్లో ‘లేదు’ అనే పదానికి బదులు ‘లెదు’ అని రాశారనే విచిత్ర కారణంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తొలగించారంటే అధికారుల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హెచ్‌ఎంపాడు మండలంలోని నాలుగు నామినేషన్ కేంద్రాల్లో 10 మంది సహా మండలవ్యాప్తంగా మొత్తం 13 మంది వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారు. వాస్తవానికి హెచ్‌ఎంపాడు కేంద్రంలో పత్రాల్లోని లోపాల వల్ల మూడు పంచాయతీల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమవుతారనే భయంతో కుట్రపూరితంగా వారి నామినేషన్లను కూడా అధికారులు తొలగించారు.
దౌర్జన్యంగా అక్రమ ఏకగ్రీవాలు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ ఏకగ్రీవాలకు తెరలేపారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటివరకు కనిగిరి మండలంలో 3, హెచ్‌ఎంపాడులో 13, వెలిగండ్లలో 4, పామూరులో 3, సీఎస్‌పురంలో 2, పీసీపల్లిలో 3 పంచాయతీలను అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నట్లు సమాచారం. విత్ డ్రా ఘట్టంలో టీడీపీ నేతలు మరెన్ని అక్రమాలకు పాల్పడతారోనని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.
నామినేషన్ కేంద్రానికి 3 కి.మీ దూరంలోనే డాక్టర్ దద్దాల, వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత
హెచ్‌ఎంపాడు ఎస్సై రాజ్‌కుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహం.. రోడ్డుపైనే శ్రేణుల బైఠాయింపు
అదే కేంద్రంలో పాగా వేసిన 200 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు
సీఐ సుబ్రహ్మణ్యం ఏకపక్ష వైఖరిపై దద్దాల మండిపాటు
అర్ధరాత్రి హైడ్రామా నడుమ ఉమ్మనపల్లి సహా హెచ్‌ఎంపాడు మండలంలో 13 నామినేషన్ల తిరస్కరణ


