గడువు దాటినా.. విత్‌డ్రాల పర్వం! | - | Sakshi
Sakshi News home page

గడువు దాటినా.. విత్‌డ్రాల పర్వం!

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

గడువు దాటినా.. విత్‌డ్రాల పర్వం! ● సమయం ముగిసినా కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణ ● అభ్యర్థులను బెదిరించి మరీ విత్‌డ్రా చేయించిన కూటమి నేతలు ● పోలీసుల ఒత్తిళ్లు.. అధికారుల అండతో బలవంతపు ఉపసంహరణలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సరెండర్‌ సరికాదు ● చీఫ్‌ సెక్రటరీకి డాక్టర్స్‌ అసోసియేషన్‌ లేఖ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి ● జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారి వెంకటేశ్వరరావు

● సమయం ముగిసినా కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణ ● అభ్యర్థులను బెదిరించి మరీ విత్‌డ్రా చేయించిన కూటమి నేతలు ● పోలీసుల ఒత్తిళ్లు.. అధికారుల అండతో బలవంతపు ఉపసంహరణలు

మార్కాపురం టౌన్‌: ఎన్నికల నిబంధనలు అధికార కూటమి నేతలకు చుట్టాలయ్యాయి. గడువు ముగిసినా నామినేషన్ల ఉపసంహరణల పర్వం ఆగలేదు. పొదిలి నగర పంచాయతీలో గురువారం సాయంత్రం 3 గంటలతో విత్‌డ్రాల గడువు ముగియాల్సి ఉండగా.. కూటమి నేతల ఒత్తిళ్లతో నాలుగున్నర గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగడం అధికారుల తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. తమకు పోటీగా ఉన్న అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు కూటమి నేతలు బెదిరింపులకు దిగగా ఎన్నికల సిబ్బంది నిబంధనలను పక్కనపెట్టి వారికి సహకరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొదిలి నగర పంచాయతీ చైర్మన్‌ పదవితో పాటు 28 వార్డుల కౌన్సిలర్‌ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో తమకు అడ్డుగా ఉన్నవారిని తప్పించేందుకు కూటమి నేతలు పావులు కదిపారు. పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. అందులో భాగంగానే సమయం ముగిసినా కార్యాలయం గేట్లు తెరిచే ఉంచారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు ఎన్నికల సిబ్బంది తలొగ్గి వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒంగోలు టౌన్‌ : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావును ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ పి. రాజాబాబు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఇదిప్పుడు వివాదంగా మారింది. కలెక్టర్‌ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాసి తమ నిరసన తెలిపింది. డాక్టర్‌ మాణిక్యరావు ముందస్తు అనుమతి లేకుండా క్యాజువల్‌ లీవ్‌ తీసుకున్నారని, ఆయనకు ఆసుపత్రి సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేదని, విధుల్లో సూపరింటెండెంట్‌ తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతున్నారని వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి కలెక్టర్‌ రాజాబాబు లేఖ రాశారు. పలుమార్లు సూచనలు చేసినా ఆయన తీరు మార్పు కనిపించడం లేదని, దీంతో ఆసుపత్రికి నిర్వాహణకు ఇబ్బందిగా మారిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు, ఆయన స్థానంలో డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌ ఫుల్‌ అడిషనల్‌ ఇన్‌చార్జిగా నియమించాలని సూచించారు. అయితే అనుమతి తీసుకునే మాణిక్యాలరావు సెలవు పెట్టారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ చెబుతోంది. ఈనెల 1వ తేదీ, 3 వ తేదీ, 5 వ తేదీన మూడు రోజుల క్యాజువల్‌ లివ్‌ కోరుతూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్కు లేఖ రాశారని, సెలవుతో పాటుగా హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లేందుకు కూడా ఆ లేఖలో అనుమతి కోరారని తెలిపింది. అయినా ముందస్తు అనుమతి లేకుండా డాక్టర్‌ మాణిక్య రావు సెలవు తీసుకున్నట్లు కలెక్టర్‌ పేర్కొనడంపై అసోసియేషన్‌ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

ఒంగోలు సబర్బన్‌: మొదటి దశ గ్రామ పంచాయతీల్లో అనుసరించాల్సిన విధానం, పోలింగ్‌కు సంబంధించిన అంశాలపై ప్రిసైడింగ్‌ అధికారులకు ఎన్నికల శిక్షణ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో గురువారం శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ముప్పూరి వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ నెల 26న నిర్వహించనున్న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓ)లకు ఎన్నికల శిక్షణను అందించామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు, పోలింగ్‌ నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, పోలింగ్‌ ముగిసిన వెంటనే అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ అదే విధంగా ఉప సర్పంచ్‌ ఎన్నిక, అధికారుల బాధ్యతలు, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులపై పూర్తి అవగాహన పెంపొందించుకొని, నిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement