ముగ్గురు అండర్‌ ట్రయల్‌ ఖైదీల పరారీ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు అండర్‌ ట్రయల్‌ ఖైదీల పరారీ

Nov 19 2026 2:43 AM | Updated on Nov 19 2026 2:43 AM

ముగ్గురు అండర్‌ ట్రయల్‌ ఖైదీల పరారీ

ఒంగోలు టౌన్‌: చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో అరెస్టయిన ముగ్గురు నిందితులు పోలీసుల కళ్లు కప్పి పరారవడం కలకలం సృష్టించింది. రైల్వే పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌కు చెందిన భూరు మక్వానా, రమేష్‌ మచ్చర్‌, సంతోష్‌ భురుయా చైన్‌ స్నాచింగ్‌, ఇతర దొంగతనాల కేసుల్లో అరెస్టయి ఒంగోలు జిల్లా జైలులో ఉన్నారు. ఈ నిందితుల మీద చీరాల పోలీసు స్టేషన్లో కేసు ఉంది. అసిస్టెంట్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో విచారణ నిమిత్తం ఖైదీలను బుధవారం చీరాల తీసుకొని వెళ్లారు. బాపట్ల జిల్లా ఆర్మడ్‌ రిజర్వ్‌ పోలీసులు హెడ్‌ కానిస్టేబుల్‌ జీ.ఏబు బాబు, ఏ.ప్రభాకర రావు, కానిస్టేబుల్‌ ఎం.నాగార్జున రెడ్డి ఎస్కార్టుగా ఉన్నారు. విచారణ తర్వాత ఖైదీలను జిల్లా జైలులో అప్పగించేందుకు తిరువన్నామలై ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు బయలుదేరారు. ఒంగోలు రైల్వే స్టేషన్లోని 5వ నంబర్‌ ప్లాట్‌ ఫాం మీద రైలు ఆగింది. ప్రయాణికులు రద్దీగా ఉండటంతో అదే అదనుగా పోలీసుల కళ్లు కప్పి ముగ్గురు ఖైదీలు పరారయ్యారు. ఒక ఖైదీ 5వ ప్లాట్‌ ఫాం నుంచి అవతల హైవే వైపునకు పారిపోగా మిగిలిన ఇద్దరు ఖైదీలు 3వ నంబర్‌ ప్లాట్‌ ఫాం వైపు పారిపోయి జనంలో కలిసిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఖైదీలు పారిపోతుండగా అక్కడ ఉన్న కొందరు ప్రయాణికులు వెంబడించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా 5వ నంబర్‌ ప్లాట్‌ ఫాంలో సీసీ కెమెరాలు కూడా లేవని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ముగ్గురు ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్సై టీ.శ్రీరాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement