మార్కాపురంలో నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద వసతులు నిల్ ఎండలో పడిగాపులు కాసిన అభ్యర్థులు, మద్దతుదారులు
పరిశీలన కేంద్రం గేటు బయట ఎండలోనే వేచివున్న అభ్యర్థులు, మద్దతుదారులు
పరిశీలన కేంద్రంలోనికి వెళ్తున్న అభ్యర్థులు
మార్కాపురం టౌన్: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మార్కాపురం కలెక్టరేట్ సమీపంలోని భవనంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఇందుకు హాజరయ్యేందుకు పొదిలి నుంచి చైర్మన్ అభ్యర్థులతో పాటు 28 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, వారి మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, అధికారులు అక్కడ కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలీచాలని టెంట్లు ఏర్పాటు చేయడంతో చాలామంది ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. కనీసం కూర్చునేందుకు కుర్చీలు, తాగేందుకు గుక్కెడు నీరు కూడా అందుబాటులో ఉంచలేదు. ఆ ప్రాంతం నుంచి మంచినీళ్లు, తినుబండారాలు తెచ్చుకోవాలన్నా సుమారు 5 కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వసతుల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అభ్యర్థులు మండిపడ్డారు. గంటల తరబడి ఎండలోనే పడిగాపులు కాసి, సాయంత్రం నామినేషన్ల పరిశీలన పూర్తయ్యాక తీవ్ర అసహనంతో వెనుదిరిగారు.


