పోలీసులా.. టీడీపీ ఏజెంట్లా? | - | Sakshi
Sakshi News home page

పోలీసులా.. టీడీపీ ఏజెంట్లా?

Nov 18 2026 1:32 AM | Updated on Nov 18 2026 1:32 AM

పోలీసులా.. టీడీపీ ఏజెంట్లా?

సింగరాయకొండ: నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న వారిని వదిలేసి, ప్రశ్నించిన తనపై కేసులు నమోదు చేయడంతో పాటు హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మర్రిపూడి మండలం కాకర్ల నామినేషన్‌ కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన ఘటనకు పోలీసులే కారణమని సురేష్‌ ఆరోపించారు. కాకర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి వెళితే ఎస్సై బి.సుదర్శన్‌, ఆర్వో రెబ్బ వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని విమర్శించారు. బాధితుల్లో ఆరు నెలల గర్భిణి కూడా ఉన్నారన్నారు. ఈ విషయం తెలిసి అభ్యర్థులతో నామినేషన్లు వేయించాలని కోరేందుకే తాను అక్కడికి వెళ్లానని, సీఐ వై.వి.రమణయ్యకు విజ్ఞప్తి చేశానే తప్ప ఎటువంటి గొడవ చేయలేదని స్పష్టం చేశారు. ఎస్సై, ఆర్వోలు నామినేషన్లను అడ్డుకోకపోతే తాను అక్కడికి వెళ్లాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో తనపైనే తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. మంగళవారం ఉదయం ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ వై.శ్రీహరి తనకు ఫోన్‌ చేసి, మర్రిపూడిలో పోలీసులతో వాగ్వాదానికి దిగినందుకు హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని సురేష్‌ తెలిపారు. ఆ తర్వాత ఎస్సై ఎల్‌.సుధీర్‌కుమార్‌ వచ్చి 41 నోటీసు ఇచ్చారన్నారు. అధికార పార్టీ అరాచకాలు, బెదిరింపులను ప్రశ్నించకుండా ఉండేందుకే తనను హౌస్‌ అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. పొన్నలూరు మండలంలో మంత్రి స్వామి నియోజకవర్గంలో ఎస్పీ స్థాయి అధికారి ప్రత్యేక బలగాలతో వచ్చి నామినేషన్లు వేయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. జిల్లాలో పోలీసు వ్యవస్థ ఎంత పక్షపాతంగా, నిస్సహాయంగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

మర్రిపూడి ఎస్సై సుదర్శన్‌ వ్యవహార శైలిపై సురేష్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయిస్తానని చెప్పి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎస్సై మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ వారు వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు వేస్తే, నిజమైన అభ్యర్థులే నామినేషన్లు వేశారని ఎస్పీకి తప్పుడు సమాచారం ఇచ్చారని దుయ్యబట్టారు. అభ్యర్థులు ఎన్ని నామినేషన్లు వేయాలో కూడా ఎస్సై సుదర్శనే నిర్ణయిస్తారా అని నిలదీశారు. చిమట, కాకర్ల, రామాయపాలెం, చిలంకూరు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఒక్క సెట్‌ మాత్రమే వేయాలని బెదిరించడం దారుణమన్నారు. ఎస్సై, ఆర్వో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతి ఒక్క వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ వేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు ఎస్సై సుదర్శన్‌ ఉంటే పోలింగ్‌ సజావుగా జరగదని, ఆయనను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే ఈసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.

సింగరాయకొండలో కూడా పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని సురేష్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థి షేక్‌ ఇస్మాయిల్‌ నామినేషన్‌ ర్యాలీ కోసం ముందస్తు అనుమతి తీసుకున్నా, తాను అందులో పాల్గొనకుండా హౌస్‌ అరెస్టు చేశారని విమర్శించారు. సోమవారం టీడీపీ అభ్యర్థి 400 మందితో ర్యాలీ చేస్తే ఏమీ అనని పోలీసులు, వైఎస్సార్‌సీపీ ర్యాలీకి మాత్రం 20 మందే రావాలని షరతులు విధించడం వారి పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో లాగే సర్పంచ్‌ ఎన్నికల్లోనూ టీడీపీ కుట్రలు పన్నుతోందని, పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

కాకర్లలో ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ల అడ్డగింత

హౌస్‌ అరెస్టులు, అక్రమ కేసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement