మద్దిపాడు: అనారోగ్య సమస్యలు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మహిపూర్ జిల్లా ఆరివాడ గ్రామానికి చెందిన నిరంజన్ సాహు(31).. మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లోని జ్యోతి రాక్స్ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో టెక్నికల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ ఆదివారం తనకు ఆరోగ్యం బాగోలేదని తోటి కార్మికులకు చెప్పి రూమ్‌కు వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం వరకూ నిరంజన్ ఎంతకీ బయటకు రాకపోవడం, బంధువులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఫ్యాక్టరీ సూపర్ వైజర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో సూపర్ వైజర్ నిరంజన్ ఉంటున్న కాంప్లెక్స్ వద్దకు వెళ్లి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.
ఒంగోలు సిటీ: యువతలో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ’వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027’ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో కేపీ వెంకటరమణ తెలిపారు. ’టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్–ఫ్యూచర్ రెడీనెస్’ అనే ప్రధాన అంశంపై నిర్వహిస్తున్న ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. 2027 జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగే జాతీయ కార్యక్రమానికి సన్నాహకంగా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీఆర్‌వో సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, యువజన అధికారి నరసింహం, స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: నగరంలోని దారావారితోట నాలుగో లైన్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో గవనికట్ల కృష్ణకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని గృహోపకరణాలు, వంటపాత్రలు, ఇతర సామగ్రి అంతా దగ్ధమైంది. ఉదయం 9.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని, సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్‌ఓ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


