మురసు తుఫాన్ నుంచి ఇంకా కోలుకోని పల్లెలు నాలుగు రోజులుగా అంధకారంలో ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాలు తాగునీటికీ తప్పని ఇబ్బందులు 3,404 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు 413 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు పరిసరాల్లో దెబ్బతిన్న పొగాకు పంట
చీకట్లోనే జనం..
నాగులుప్పలపాడు మండలంలో ఫోన్లకు చార్జింగ్ కోసం పెట్రోల్ బంకు వద్ద పడిగాపులు కాస్తున్న యువత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
మురసు తుఫాన్ మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలు – చిన్నగంజాం మధ్య తీరం దాటింది. సోమవారం అర్ధరాత్రి నుంచే భీకరగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. తీరం దాటే సమయంలో 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, అద్దంకి, మద్దిపాడు, జె.పంగలూరు. కొరిశపాడు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో తీగలు తెగిపోయి స్తంభాలు పడిపోయాయి. ప్రధానంగా ఒంగోలు మండలం, నాగులుప్పలపాడు, కొత్తపట్నం మండలాల్లో అపార నష్టం వాటిల్లింది. రహదారులు కోతకు గురయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. పొగాకు బ్యారన్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు కొన్ని చోట్ల కూలిపోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ లేకపోవడంతో హోటళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. రాత్రులు ప్రజలు దోమల బెడదతో అల్లాడిపోతున్నారు. కనీసం సెల్‌ఫోన్లకు చార్జింగ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా కొందరు మండల కేంద్రాల్లో జనరేటర్లు పెట్టి సెల్‌ఫోన్ చార్జింగ్‌కు రూ.50 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం రెండు రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పినా.. నాలుగు రోజులు దాటుతున్నా కరెంటు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండే కరవది, పానకాలపాలెం, చేజర్ల, ఉలిచి, దేవరంపాడు, పాతపాడు, గుండాయపాలెం తదతర ప్రాంతాల్లో నేలకొరిన చెట్లను తొలగించేవారు కరువయ్యారు. కూలిన విద్యుత్ స్తంభాలను సైతం పట్టించుకోకపోవడంతో నాలుగు రోజులుగా ఆ గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. రవాణా స్తంభించిపోయింది. నిత్యావసరాలు సైతం దొరక్క జనం పడుతున్న అవస్థలు వర్ణణాతీతం.
ఇంకా అంధకారంలోనే...
తుఫాన్ దెబ్బకు జిల్లాలోని తీరప్రాంత గ్రామాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు శుక్రవారం రాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. కరెంటు లేక తాగునీటి పథకాల మోటార్లు పనిచేయడం లేదు. కొళాయిల నుంచి నీరు రాక జనం గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. తుఫాన్ వచ్చి నాలుగు రోజులైనా కష్టాలు తీరక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో సుమారు 200 ట్రాన్స్‌ఫార్మర్లు, 2,500కుపైగా విద్యుత్ స్తంభాలు, 75 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ శాఖకు రూ.6 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్భాటంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రహదారులపై కూలిన చెట్లను తొలగించకపోవడం, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయకపోవడంతో పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సిబ్బందిని రప్పించి పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. గ్రామాల్లో ప్రజలకు తుఫాన్ కష్టాలు మాత్రం తప్పడం లేదు.
రైతన్నకు కోలుకోలేని దెబ్బ...
రైతుల పాలిట పెను శాపంగా తుఫాన్ మారింది. సాగునీరు లేక ఇప్పటికే పంటలు వేయలేక విలవిల్లాడుతున్న అన్నదాతలపై ప్రతాపం చూపింది. అరకొరగా సాగైన పంటలపై కూడా పంజా విసిరింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతులను మరింత కోలుకోలేని దెబ్బ తీసింది. రెక్కల కష్టంతో సాగు చేసిన పంటలను నేలపాలు చేసి అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. 8 మండలాల పరిధిలోని 90 గ్రామాల్లో 3,404 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా.. 4,294 మంది రైతులకు రూ.8.51 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉద్యానవన పంటలపైనా తీవ్ర ప్రభావం...
తుఫాన్ ప్రభావంతో ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, ఉలవపాడు, తాళ్లూరు, చీమకుర్తి, కొత్తపట్నం, జె.పంగులూరు, కొరిశపాడు, ముండ్లమూరు, సంతనూతలపాడు మండలాల్లో వివిధ రకాల ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. అరటి 54.20 హెక్టార్లు, బొప్పాయి 43.31, కూరగాయలు 95.44, మిరప 133.20, జామ 40.80, మామిడి 30.80, కొబ్బరి 2, నిమ్మ 8, డ్రాగన్‌ఫ్రూట్ 0.40, షేడ్‌నెట్ నార్లు 1.88, సపోటా 5 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. మొత్తం 553 మంది రైతులకు చెందిన పంటలకు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఉద్యానవనశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో పంట నష్టాలపై సర్వే కొనసాగుతోందని, మరో రెండు రోజుల్లో సర్వే పూర్తిచేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఉద్యానవన శాఖాధికారి వై.గోపీచంద్ తెలిపారు.
పంట నష్టం అంచనా వేస్తున్నాం
పంట నష్టానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నాం. పూర్తి స్థాయిలో సర్వే చేశాక పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తాం.
– శ్రీనివాస్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు


