ఒంగోలు టౌన్: సముద్రంలో చేపల వేటకు వెళ్లి మురసు తుపాను ప్రభావంతో గల్లంతైన తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలకు ఒంగోలు జీజీహెచ్‌లో శుక్రవారం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. వేటకు వెళ్లిన వారిలో మొత్తం 9 మంది గల్లంతు కాగా, కొత్తపట్నం తీర ప్రాంతంలో ఏడుగురి మృతదేహాలు, సింగరాయకొండ మండల పరిధిలోని పాకల తీర ప్రాంతంలో ఒకటి, కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం తీరంలో మరొకరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి మేరి విల్సన్ ఒంగోలు జీజీహెచ్‌కు చేరుకుని పోస్టుమార్టం ప్రక్రియను, మృతదేహాల తరలింపు ఏర్పాట్లను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, అడ్మినిస్ట్రేటర్ వెంకటరమణ మంత్రికి వివరాలను వెల్లడించారు. మృతదేహాల గుర్తింపు, శవపరీక్షలు, తరలింపు ప్రక్రియల్లో సమన్వయంతో వ్యవహరించిన కలెక్టర్‌తో పాటు జీజీహెచ్ వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
జీజీహెచ్‌లో ఏర్పాట్లను పరిశీలించిన తమిళనాడు మంత్రి మేరి విల్సన్
తీరానికి చేరిన 9 మంది మృతదేహాలు.. స్వస్థలాలకు తరలింపు


