ఒంగోలు టౌన్: ఫ్లోరోస్కోపీ యంత్రం ఏర్పాటు చేయడంతో జీర్ణవ్యవస్థకు సంబంధించి అత్యంత ఆధునిక వైద్యం ఒంగోలు జీజీహెచ్‌లో అందుబాటులోకి వచ్చినట్లయిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 1.30 కోట్ల రూపాయల ఖరీదు చేసే అత్యాధునిక ఫ్లోరోస్కోపీ వైద్య పరికరాలన్ని డాక్టర్ మాణిక్యరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్లోరోస్కోపీ యంత్రంతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన ప్రక్రియలను రియల్‌టైమ్‌లో ఎక్స్‌రే చిత్రాల ద్వారా పరిశీలించే అవకాశం ఉంటుందని చెప్పారు. సాధారణ ఎక్స్‌రేల ద్వారా గుర్తించడం సాధ్యంకాని అరుదైన సమస్యలను ఈ పరికరం ద్వారా గుర్తించవచ్చన్నారు. దాంతో మెరుగైన వైద్య చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఒంగోలు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ నరసింహాచారి మాట్లాడుతూ ఈ పరికరంతో అన్నవాహిక, కడుపు, చిన్నపేగుల పనితీరును గమనించవచ్చన్నారు. వ్యాధి నివారణకు కీలకమైన సమాచారాన్ని అందించగలుతామని చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: దీపావళి పండుగను పురస్కరించుకుని వ్యాపారులు లైసెన్సులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్దన్‌రాజు హెచ్చరించారు. ఆ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బాణసంచా తయారీదారులు, నిల్వలు, విక్రయాలు చేసే వ్యాపారులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని స్పష్టం చేశారు. నివాస గృహాల్లో బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం నిషేధమన్నారు. నిర్దేశిత ప్రదేశాలలో నిర్ణీత భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌లో టపాసులు విక్రయించుకోవాలని సూచించారు. బాణసంచా దుకాణాల పరిసరాలలో మండే స్వభావం కలిగిన వస్తువులు ఉంచకూడదని, ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. చిన్న పిల్లలను బాణసంచా దుకాణాల్లో విక్రయాల కోసం ఉంచరాదని సూచించారు. లైసెన్స్ కలిగిన దుకాణదారులు మాత్రమే విక్రయాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. బాణసంచా దుకాణాలకు సమీపంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతించకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా బాణసంచా విక్రయాలు జరిగినా, నిల్వలు చేసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల వద్ద మాచర్ల–గుంటూరు రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఉబ్బరపు శివనారాయణ(21) నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీలో మూడో ఏడాది చదువుతున్నాడు. శివనారాయణకు ఈవెంట్స్ ప్రోగ్రామ్‌లో చేసే డ్యాన్సర్‌తో పరిచయం ఏర్పడింది. అందులో భాగంగా ఎక్కడ ఈవెంట్స్ ఏర్పాటు చేసినా ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుంటాడు. అదే క్రమంలో రాజుపాలెం సమీపంలో ఉన్న గంగిరెడ్డిపాలెంలో గల శివాలయంలో వివాహం సందర్భంగా ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్స్ చూసేందుకు నరసరావుపేటకు చెందిన స్నేహితులు రేగళ్ల మణి, గొల్ల విష్ణుతో కలిసి ద్విచక్రవాహనంపై రాజుపాలెం వచ్చారు. ప్రోగ్రాం ముగిసిన అనంతరం డ్యాన్సర్లు, సామగ్రిని వాహనంలో వేసుకుని నరసరావుపేట బయలుదేరారు. ఆ వాహనం వెనుకవైపునే శివనారాయణ ఇద్దరు స్నేహితులతో బయలుదేరాడు. కస్తుర్భా గాంధీ పాఠశాల సమీపంలోకి వెళ్లగానే వాహనం డ్రైవర్ షడన్ బ్రేక్ వేశాడు. అతివేగంతో వస్తున్న ద్విచక్రవాహనం వెనుక నుంచి వాహనాన్ని ఢీకొంది. బైక్‌పై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడ్డారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న శివనారాయణకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఇరువురు స్నేహితులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై మణికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


