ప్రాదేశిక కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

Nov 7 2026 6:20 PM | Updated on Nov 7 2026 6:20 PM

నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒంగోలులోని రైజ్‌, క్విస్‌ కాలేజీల్లో కౌంటింగ్‌ కేంద్రాలు రైజ్‌ కాలేజీలో కందుకూరు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల కౌంటింగ్‌ క్విస్‌ కాలేజీలో ఒంగోలు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల కౌంటింగ్‌ రెండు కేంద్రాల్లో కలిపి 313 కౌంటింగ్‌ టేబుళ్ల ఏర్పాటు 2,274 మంది సిబ్బంది కేటాయింపు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక స్థానాల ఓట్ల లెక్కింపును ఒంగోలులోని రైజ్‌, క్విస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నిర్వహించనున్నారు. దీని కోసం అన్ని రకాల భద్రతాపరమైన చర్యలను అధికారులు తీసుకున్నారు. టింగ్‌ కేంద్రాల్లో మండలాల వారీగా లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,274 మంది సిబ్బందిని కేటాయించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లు లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లు లెక్కిస్తారు.

రైజ్‌ కాలేజీలో 660 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపు...

కందుకూరు, కొండపి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రాదేశిక స్థానాల ఓట్ల లెక్కింపును రైజ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో మండలాల వారీగా ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 660 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇక్కడ జరగనుండగా, 184 కౌంటింగ్‌ టేబుళ్లు, 1338 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో జరుగుమల్లి, కొండపి, కందుకూరు, గుడ్లూరు, సంతనూతలపాడు మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అలాగే మొదటి అంతస్తులో టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు మండలాలు, రెండో అంతస్తులో మద్దిపాడు, చీమకుర్తి, మూడో అంతస్తులో వేటపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

క్విస్‌ కాలేజీలో 605 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపు...

ఒంగోలు, దర్శి, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఒంగోలులోని క్విస్‌ కాలేజీలో జరగనుంది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం 129 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. 936 మంది కౌంటింగ్‌ సిబ్బంది పాల్గొననున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కొత్తపట్నం మండల ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి అంతస్తులో ఒంగోలు, తాళ్లూరు, కురిచేడు, దర్శి మండలాలు, రెండో అంతస్తులో దొనకొండ, సంతమాగులూరు, కొరిశపాడు, జె పంగులూరు, మూడో అంతస్తులో ముండ్లమూరు, అద్దంకి, బల్లికురవ మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ విషయాలను గమనించి రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్‌లు, అభ్యర్థులు నిర్దేశిత సమయానికి కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల అధికారులు సూచించారు.

మార్కాపురం జిల్లాలో...

మార్కాపురం టౌన్‌: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్‌ను మార్కాపురం మార్కెట్‌ యార్డులో నిర్వహించనున్నారు. గిద్దలూరు నియోజకవర్గం కౌంటింగ్‌ను కంభం గవర్నమెంట్‌ కాలేజీ వద్ద, కనిగిరి నియోజకవర్గం కౌంటింగ్‌ను కనిగిరి మోడల్‌ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. మార్కాపురం మార్కెట్‌ యార్డులోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లో దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, కొనకనమిట్ల, మార్కాపురం, పొదిలి, తర్లుపాడు మండలాలకు చెందిన కౌంటింగ్‌ ఉంటుందని తెలిపారు. ఈ 9 మండలాలకు సంబంధించి 335 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్‌లో 281 మంది సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాల్లోని 291 పోలింగ్‌ స్టేషన్లకు 66 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేయగా, 330 మంది సిబ్బంది పాల్గొననున్నట్లు వివరించారు. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాల్లో 120 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 38 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 160 మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 746 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 132 టేబుళ్లు ఏర్పాటు చేయగా, మొత్తంమీద 772 మంది సిబ్బంది కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారని కలెక్టర్‌ వెల్లడించారు. కౌంటింగ్‌ సందర్భంగా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement