కందుకూరు మున్సిపల్
ఎన్నికలకు రంగం సిద్ధం
కందుకూరు:
గ్రామాల విలీనం సమస్య, కోర్టు కేసుల పెండింగ్ వంటి సమస్యలతో దాదాపు 15 ఏళ్ల తరువాత కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ, చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దశాబ్దన్నర కాలం తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అటు రాజకీయ ఆశావాహుల్లోను, ఇటు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
2007లో చివరి సారిగా కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ కౌన్సిల్ పదవీకాలం 2012 వరకు కొనసాగింది. ఈ క్రమంలో మున్సిపాలిటీలో ఆనందపురం, దివివారిపాలెంలతో పాటు పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సమస్య ప్రారంభమైంది. గ్రామాల విలీనంపై కోర్టులో కేసులు పెండింగ్ కారణంగా 2012 తరువాత కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఇటీవలే పెండింగ్ కేసులను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్‌క్లియర్ అయింది. కోర్టు కేసులు పరిష్కారమైనా వార్డుల పునర్విభజన, ఓటర్‌ల జాబితా తయారీ, రిజర్వేషన్ కేటాయింపు వంటివి ఖరారు కాకపోవడంతో కందుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు అధికారులు తీసుకోవడంతో ఎన్నికల జరిపేందుకు మార్గం సుగమమైంది. రెండవ విడత మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కందుకూరు మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందంటూ అటు అధికారులు, ఇటు రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మున్సిపల్ రాజకీయం జోరుగా సాగుతుంది.
జనరల్ కేటగిరి అభ్యర్థికి చైర్మన్ సీటు కేటాయింపు
2007లో పరోక్ష పద్ధతిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో బీసీ అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ సీటును కేటాయించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బూర్సు మాలకొండయ్య చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కందుకూరు మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరికి చెందిన వారికి కేటాయించడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అదే సందర్భంలో వార్డుల రిజర్వేషన్‌లు కూడా ఖరారు కావడంతో చాలా కాలంగా కౌన్సిలర్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్సాహం నెలకొంది. గత ఎన్నికల సమయంలో 30 వార్డులు మాత్రమే ఉండగా, గ్రామాల విలీనం తరువాత పెరిగిన ఓటర్లకు అనుగుణంగా వార్డుల సంఖ్య 40కి పెంచుతూ అధికారులు వార్డుల పునర్విభజన చేపట్టారు. 40వార్డుల రిజర్వేషన్‌లను ఖరారు చేస్తూ తాజాగా అధికారులు ఉత్తర్వులిచ్చారు. అయితే కౌన్సిలర్ పదవులు ఆశిస్తున్న చాలా మందిని ఈ రిజర్వేషన్‌లు నిరాశకు గురిచేశాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. రిజర్వేషన్‌ల ప్రాతిపదికన మహిళా అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు కొన్ని వార్డుల కేటాయించడంతో ఆయా ప్రాంతాల్లో పెత్తనం చేసే నాయకుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. అదే సందర్భంలో కొన్ని వార్డులను మాత్రం బడా నాయకులు తమకు అనుకూలంగా రిజర్వేషన్ కేటాయింపుకున్నారని అధికార పార్టీ నాయకుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార పార్టీలో ముసలం
మున్సిపల్ ఎన్నికలు జరగడం ఖాయం కావడం, జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థికి చైర్మన్ సీటు రిజర్వ్ కావడంతో అధికార పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది. చైర్మన్ అభ్యర్థిత్వం కోసం ఎమ్మెల్యే ఇంటూరి అనుకూల, వ్యతిరేక వర్గాలు పట్టుబడుతున్నాయి. మాజీ పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్రా మాల్యాద్రి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావుతో పాటు, షాడో ఎమ్మెల్యేగా కీర్తించబడుతున్న వడ్లమూడి సురేష్ వంటి నేతలు తెరపైకి వచ్చారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కూడా తన సతీమణి దివి సౌభాగ్యని చైర్మన్ చేసేందుకు పోటీ పడుతున్నారు. దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు తమకు చైర్మన్ పదవి కేటాయించాలని పట్టుబడుతుండగా, సౌభాగ్య చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆశావాహులు ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అనూహ్యంగా సౌభాగ్యను తెరపైకి తీసుకురావడం, దీనికి దివి శివరాం తాము చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శివరాంను కాదని ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన వారికి చైర్మన్ పదవిని కేటాయించుకుంటారా లేదా సుధీర్ఘ రాజకీయ నేపథ్యం, వర్గం ఉన్న శివరాం వర్గానికి చైర్మన్ పదవి దక్కుతుందా అనేది చర్చగా మారింది. మరోపక్క పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి చైర్మన్ పదవి కోసం డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో వారికి చెక్ పెట్టేందుకు తనకు రైట్‌హ్యాండైన వడ్లమూడి సురేష్‌ను ఎమ్మెల్యే కావాలనే తెరపైకి తెచ్చారనే వాదనలున్నాయి. అధికార పార్టీలో సాగుతున్న ఈ రాజకీయ పరిణామాల ఎటువైపు దారితీస్తాయోనని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 15 ఏళ్ల తరువాత జరగనున్న
కందుకూరు మున్సిపల్ ఎన్నికలు
చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం
త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్
విడుదలవుతుందంటూ జోరుగా ప్రచారం


