ఇంటూరి.. ఇదేనా నీ సంస్కృతి..? | - | Sakshi
Sakshi News home page

ఇంటూరి.. ఇదేనా నీ సంస్కృతి..?

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

కందుకూరు: నేను కందుకూరు రూపురేఖలు మార్చాను.. వందల కోట్లతో అభివృద్ధి చేశానని నిత్యం గొప్పలు చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలవకుండా ఎంపీటీసీ స్థానాల్లో గెలిచేందుకు దాడులు, దౌర్జనాలు ఎందుకు చేస్తున్నాడంటూ వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ నిలదీశారు. స్థానిక కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా మూడు రోజుల పాటు నియోజకవర్గంలో టీడీపీ గూండాలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. కడప, కావలితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రౌడీలను పోగేసి నామినేషన్‌ కేంద్రాల వద్ద వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారన్నారు. నామినేషన్‌ కేంద్రాల్లో వందల మంది టీడీపీ మూకలు ఉంటే.. ఆ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. నామినేషన్‌లు వేయడానికి వెళ్లిన తమ అభ్యర్థులచే నామినేషన్‌లు వేయించకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని వివరించారు. ఇటు పోలీసుల అడ్డంకులు, రౌడీల దాడులను ఎదుర్కొని నామినేషన్‌ కేంద్రంలోకి వెళితే.. కేంద్రంలో మాటువేసిన వందల మంది టీడీపీ మూకలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌కు, కలెక్టర్‌, ఎస్పీలకు పెద్ద ఎత్తున ఫిర్యాదు పంపితే.. చివరిరోజు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. లింగసముద్రం నామినేషన్‌ కేంద్రంలో 2000 మంది టీడీపీ మూకలు స్వైరవిహారం చేశారని, తమ పార్టీ అభ్యర్థులను కొట్టారని వివరించారు.

అభ్యర్థులను కిడ్నాప్‌ చేశారు...

నామినేషన్‌లు వేయడానికి వెళ్లిన తమ అభ్యర్థులను టీడీపీ నాయకులు కిడ్నాప్‌ చేశారని బుర్రా ఆరోపించారు. వీఆర్‌ కోట స్థానం నుంచి నామినేషన్‌కు వెళ్లిన ఇద్దరు అభ్యర్థులపై దాడిచేసి కొట్టి కిడ్నాప్‌ చేశారని చెప్పారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టారన్నారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిన లింగసముద్రం ఎస్సై తిరిగి తమ అభ్యర్థినే బెదిరిస్తున్నారని, ఫిర్యాదు చేస్తే.. టీడీపీ వాళ్లు చంపేస్తారంటూ బెదిరిస్తున్నారన్నారు. బాధితుడిచే తెల్లకాగితంపై సంతకం చేయించుకుని ఎస్సైకి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని చెప్పారు. లింగసముద్రం ఎస్సైపై ప్రైవేట్‌ కేసులు దాఖలు చేస్తామని వివరించారు.

నామినేషన్ల తిరస్కరణ నీ ఘనత కాదా..?

ఇన్ని దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొని ప్రాణాలు తెగించి నామినేషన్‌లు వేసుకుంటే కుట్రపూరితంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారంటూ బుర్రా మండిపడ్డారు. ఎక్కడైతే వైఎస్సార్‌ సీపీ గెలిచే అవకాశం ఉందో ఆయా స్థానాల్లో తమ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. మాచవరం, పాలూరు–దొండపాడు, బద్దిపూడి, చుండి, తదితర ప్రాదేశికాల్లోని నామినేషన్లను అడ్డగోలుగా తిరస్కరిస్తున్నారన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో మరొకటి ఉండదన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ఎన్నికలను ఎదుర్కొని గెలిచే సత్తా లేదని, అందువలనే అడ్డదారిలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అడ్డదారిలో

గెలవడమా నీ ఘనత

నామినేషన్లలోనే దాడులు, దౌర్జన్యాలనే

కొత్త సంస్కృతి తెచ్చావు

ఎన్నికలు జరిగితే గెలవలేమని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించేలా కుట్రలు పన్నావు

అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే నీవు.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు భయమెందుకు..?

త్వరలో జరిగే ఎన్నికల్లో ఇంకెన్ని ఘనకార్యాలు

చేస్తావో..

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరిపై వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా ధ్వజం

కందుకూరుకు కొత్త సంస్కృతి తెచ్చావు...

ఎన్నికల్లో దాడులు చేసి నామినేషన్‌ పత్రాలు చించి గెలిచే సంస్కృతి గతంలో కందుకూరులో ఎప్పుడూ లేదని, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొత్తగా కందుకూరు నియోజకవర్గానికి ఆ సంస్కృతి తీసుకొచ్చారని బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మండిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ నామినేషన్ల సందర్భంగా ఆ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత కందుకూరులో ఆ పార్టీకి 20 ఏళ్ల పాటు ఎందుకు అధికారం ఇవ్వలేదో అర్థమవుతోందన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనే విషయాన్ని ఎమ్మెల్యే ఇంటూరితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఓడితే ఇంటూరి అడ్రస్‌ లేకుండా పోతాడని, ఆ తర్వాత టీడీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే చెప్పిన విధంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు. నామినేషన్లలోనే ఇంత అరాచకం ఉంటే ఇక ఎన్నికల్లో ఆ టీడీపీ గూండాలు ఏ స్థాయిలో బరి తెగిస్తారో తలచుకుంటే తనకే భయమేస్తుందన్నారు. ఇక ఓట్లు వేయడానికి వచ్చే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement