సాక్షి టాస్క్‌ఫోర్స్: నామినేషన్ వేస్తుంటే రెండు సార్లు అడ్డుకుని విచక్షణా రహితంగా కొట్టారని కాసు సుబ్బారెడ్డి అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దర్శి పట్టణంలో శుక్రవారం జరిగింది. బాధితుడు కాసు సుబ్బారెడ్డి కుమారుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాసు సుబ్బారెడ్డి, ఆయన భార్య అనంతలక్ష్మి వైఎస్సార్ సీపీ బసిరెడ్డిపల్లె ఎంపీటీసీగా నామినేషన్ వేయాలని మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఎస్సై అడ్డుకుని లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. నామినేషన్ వేస్తే కేసులు పెడతామని బెదిరించి వెనక్కి పంపేశారు. ఇంతలో దర్శికి వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చని ఓపెన్‌గా ప్రకటించారు. ఇది తెలుసుకున్న సుబ్బారెడ్డి అక్కడే ఉండి తన బావమరిది శివారెడ్డిని తోడుగా పంపి అనంతలక్ష్మితో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అక్కడ టీడీపీ నేతలు ఉండటంలో ముందుగా కలెక్టర్‌కు ఫోన్ చేసి నామినేషన్ వేయనీయడం లేదని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫోన్‌లైన్‌లో ఉండి నామినేషన్ వేసేందుకు పంపించారు. మొదటి, రెండో బారికేడ్‌ల వద్ద కానిస్టేబుల్‌తో కలెక్టర్ ఫోన్‌లో చెప్పి పంపారు. నామినేషన్ సెంటర్ వద్దకు వెళ్లే సరికి టీడీపీ నేతలు అకస్మాత్తుగా వచ్చి కలెక్టర్ ఫోన్ లైన్‌లో ఉండగానే విచక్షణా రహితంగా కొట్టారు. ఒకసారి పంపితే మళ్లీ వచ్చారా.. అంటూ టీడీపీ నేతలు నామినేషన్ పత్రాలు లాక్కుని చించేసి దాడి చేశారు. కలెక్టర్ లైన్‌లో ఉన్నారని చెప్తున్నా వినిపించుకోకుండా పోలీసుల కళ్లెదుటే దారుణంగా కొట్టి పంపారు. దమ్ముంటే నామినేషన్ వేయండంటూ వేలు చూయించి హెచ్చరికలు జారీ చేస్తూ అవమానకరంగా అసభ్య పదజాలంతో దూషించారు. ఆ తర్వాత ఫోన్‌లో కలెక్టర్‌ను శివారెడ్డి నిలదీశారు. దీంతో కలెక్టర్ సీఐకి ఫోన్ చేసి వారికి భద్రత కల్పించి వారితో నామినేషన్ వేయించాలని ఆదేశించారు. దీంతో సీఐ ఆదేశాల మేరకు వారి వద్దకు వెళ్లిన ఎస్సై తాను నామినేషన్‌కు తీసుకుని వెళ్తానని చెప్పగా మొదట వస్తే మీరే కొట్టి పంపారు.. మళ్లీ వస్తే టీడీపీ నేతలు కొట్టారు.. పోలీసుల ముందు టీడీపీ నేతలు కొడితేనే చూస్తూ ఉండిపోయారు.. మీ మీద నాకు నమ్మకం లేదు. మమ్మల్ని మళ్ళీ కొట్టిస్తారని తెగేసి చెప్పాడు. దీంతో ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనను, తన బావమరిదిని విచక్షణారహితంగా కొట్టారన్న మనస్తాపంతో కాసు సుబ్బారెడ్డి నామినేషన్ సెంటర్‌కు కూతవేటు దూరంలో గడియారం స్తంభం సెంటర్‌లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 72 గంటలు గడిస్తేగానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
టీడీపీ గూండాలు దాడి చేయడంతో
ఆత్మహత్యాయత్నం


