అభివృద్ధి కావాలా.. విధ్వంసం కావాలా..? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కావాలా.. విధ్వంసం కావాలా..?

Oct 25 2026 1:41 AM | Updated on Oct 25 2026 1:41 AM

ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు

చీమకుర్తి రూరల్‌:

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చీమకుర్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారంపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో చీమకుర్తి మున్సిపాలిటీలో రూ.63 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. అభివృద్ధి చేసే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కావాలో.. విధ్వంసం చేసే కూటమి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. చీమకుర్తి మున్సిపాలిటీలోని 14, 15, 16 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి, కౌన్సిలర్‌ అభ్యర్థులతో కలిసి శనివారం బూచేపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 14వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి పేరం కోటేశ్వరి, 15వ వార్డు అభ్యర్థి దేవరకొండ పద్మ, 16వ వార్డు అభ్యర్థి సోమ పార్వతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో బూచేపల్లి, మేరుగు, మేడగంకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు హారతులతో బ్రహ్మరథం పట్టారు.

ఓటర్లతో బూచేపల్లి మాట్లాడుతూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన సుపరిపాలన అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో సైతం విఫలమయ్యారన్నారు. ఆనాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా చెప్పినవాటితో పాటు చెప్పని వాటిని కూడా చేయగా.. నేడు చంద్రబాబు చెప్పినవి కూడా చేయకుండా ప్రజలకు ద్రోహం చేస్తున్నాడన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి, కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

వైఎస్సార్‌ సీపీతోనే అభివృద్ధి : మేరుగు నాగార్జున

వైఎస్సార్‌ సీపీ పరిపాలనలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున అన్నారు. చీమకుర్తి మున్సిపాలిటీలో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గడప గడపకు వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏకలవ్య నగర్‌, బండ కాలనీ, పల్లపోతువారివీధి, విడతలపూడి రోడ్డులో శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే చీమకుర్తి మున్సిపాలిటీకి మేలు జరిగిందని ఓటర్లకు వివరించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని, ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, నాయకులు మంచ హరికృష్ణ, కంజుల ప్రతాపరెడ్డి, కాజా మొద్దీన్‌, సోమ శేషాద్రి, సోమ పార్వతి, మేడగం హర్షిత్‌, కాశయ్య, కిష్టపాటి శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బడే అయ్యప్పరెడ్డి, పాటిబండ్ల గంగయ్య, తప్పక బాబూరావు, పత్తి కోటేశ్వరరావు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement