కంభం: అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి స్థానిక వై.జంక్షన్ వద్ద హైవేపై వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ బైక్ ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం హైవేపై ఉన్న డివైడర్ సమీపంలో చాయ్వనం వద్ద వేగంగా స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న యువకులు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలవగా.. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఇటీవల పలువురు యువకులు స్పోర్ట్స్ బైక్‌లపై మితిమీరిన వేగంతో పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ పట్టణంలో తిరుగుతూ ప్రజలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పోలీసులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నలుగురికి గాయాలు


