వాటి జోలికి వెళ్లగలరా.?
కొత్తపట్నం: రాజకీయంగా విమర్శలు, ప్రశ్నలు చేసుకోవాలి తప్ప ఆస్తులను ధ్వంసం చేసి నష్టం కలిగించడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. కొత్తపట్నం మండలం బీరంగుంట గ్రామంలో మాజీ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రొయ్యల చెరువులను తహసీల్దార్, ఫిషరీస్ జేడీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా అక్రమంగా పొక్లెయిన్‌తో చదును చేస్తున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న చుండూరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీంద్రరెడ్డి, బీరంగుంట, మోటుమాల గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పనిచేస్తున్న పొక్లెయిన్‌ను వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చుండూరి రవిబాబు మాట్లాడుతూ అధికారులు చెరువులను చదును చేయడానికి వస్తే సంబంధిత విషయాలపై మాట్లాడేందుకు తహసీల్దార్, ఫిషరీస్ జేడీని రావాలని కోరినా వారు స్పందించలేదన్నారు. మండలంలో అధిక శాతం రొయ్యల చెరువులు డీకే భూముల్లో సాగు చేస్తున్నారని, అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు కూడా డీకే పట్టాలు, అవసరమైన అనుమతులు ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎటువంటి అనుమతులు లేకుండా వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. కానీ అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉన్న 20 ఎకరాలకు అనుమతులు ఉన్నా వాటిని చదును చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జనార్దన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బీరంగుంట గ్రామంలో సుమారు 250 మంది జనాభా ఉండగా, అక్కడ శ్మశానవాటికకు సంబంధించి వచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని అంజిరెడ్డి చెరువులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. చెరువులు గ్రామానికి దూరంగా ఉన్నాయని, వాటివల్ల గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు చెబుతున్నారని తెలిపారు. అంజిరెడ్డిని టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేసి, ఆయన నిరాకరించడంతోనే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేయాలి కానీ, రైతుల ఆస్తులకు నష్టం కలిగించడం సమర్థనీయం కాదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఇలాంటి చర్యలకు ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు. రాజుపాలెం ప్రాంతంలో పెద్దఎత్తున అనుమతులు లేని ఆక్వా చెరువులు ఉన్నాయని, వాటిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. జజ్జర సాంబయ్య అనే దళిత రైతు 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వరి పంటను తొలగించారని ఆరోపించారు. అంజిరెడ్డి చెరువులను చదును చేస్తున్న తహసీల్దార్, ఫిషరీస్ జేడీ చర్యలకు సంబంధించి న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబసభ్యులకు 20 ఎకరాల అసైన్‌మెంట్ భూమికి డీకే పట్టాలు ఉన్నాయని, రొయ్యల సాగుకు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు తెలిపారు. గత 30 ఏళ్లుగా అక్కడ సాగు చేస్తున్నామని చెప్పారు. చెరువులు బీరంగుంట గ్రామానికి సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్నాయని, వాటివల్ల గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. శ్మశానవాటికను కారణంగా చూపించి 30 ఏళ్లుగా సాగు చేస్తున్న చెరువులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. తన చెరువుల వల్ల బీరంగుంట గ్రామానికి లేదా శ్మశానవాటికకు ఇబ్బంది ఉంటే, ఎవరూ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే తానే వాటిని తొలగిస్తానని అంజిరెడ్డి స్పష్టం చేశారు.
రాజుపాలెంలో రాజుపాలెంలో దామచర్ల ఆంజనేయులు ఆక్వా పేరు మీద 250 ఎకరాల్లో చట్టబద్దత లేనివి గుంట, వాగు, బకింగ్‌హామ్ కాలువ, డొంక పారంబోకు భూములు ఉన్నాయని, వాటికి జోలికి పోయే దమ్ము అధికారులకు ఉందా అని సవాల్ విసిరారు. రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే జనార్దన్ చేసిన అక్రమాలన్నింటినీ సాక్షాలతో సహా బయటపెడతామన్నారు. రాష్ట్ర రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఆళ్ల రవీంద్రరెడ్డి మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు రొయ్యల చెరువులు సాగు చేసుకునే అవకాశం కల్పిస్తూ, స్థానికంగా అర్హత కలిగిన రైతు అంజిరెడ్డి చెరువులపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. కక్ష సాధింపు చర్యలపై పోరాటం చేస్తామని, విషయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుంతోటి రాజీవ్, అన్నవరపు కమలాకర్‌లు మాట్లాడుతూ అంజిరెడ్డి కుటుంబ సభ్యుల చెరువుల వల్ల శ్మశానానికి గానీ, గ్రామానికి గానీ ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారన్నారు.
చెరువు కట్టలను చదును చేయడం దుర్మార్గం
30 ఏళ్లుగా సాగు చేస్తున్న చెరువులపై
ఇంత దుర్మార్గమా
గ్రామానికి హాని లేని చెరువులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?
ఎమ్మెల్యే జనార్దన్ తీరుపై వైఎస్సార్ సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మండిపాటు


